
'బీజేపీ మంటల్లో ఉంది'
పాట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ మరోసారి బీజేపీపై విమర్శల వర్షం కురిపించారు. బీజేపీ మంటల్లో ఉందని, ఆ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరని అన్నారు. ఆ పార్టీలో భూకంపం వస్తుందో లేక అగ్నిపర్వతం బద్ధలవుతుందో ఎవరికీ తెలియదని చెప్పారు. బీహార్లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండా ఆ పార్టీ దోబూచులాడుతుందని, కుల రాజకీయాలకు పాల్పడే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. గతంలో ఇలాంటి ప్రయత్నాలు చేసినా పెద్దగా ఏం చేయలేకపోయారని ఈసారి కూడా అదే జరగుతుందని చెప్పారు.
ఇప్పటికే ఆ పార్టీ నేతల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టెక్కే అంశంపై గుబులు పుట్టుకొచ్చిందని ఆ ఎన్నికల్లో బీజేపీ గట్టెక్కలేదని చెప్పారు. తాను కేవలం ఆరోపణలు చేయాలనే ఉద్దేశంతో ఈ మాటలు అనడం లేదని ఇటీవల ఆ పార్టీ సీనియర్ నేత, కురువృద్ధుడు ఎల్కే అద్వానీ కూడా సొంత ప్రభుత్వంపైనే నమ్మకం లేని మాటలు అన్నారని, దేశంలో అత్యవసర పరిస్థితి కూడా వచ్చే అవకాశముందంటూ ఆయన చేసిన మాటలను గుర్తు చేశారు. కేంద్రలో ఒకే వ్యక్తి చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయని ఆ వ్యక్తి ఎవరో ఇప్పటికే దేశం మొత్తం తెలుసని తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని ప్రధాని నరేంద్రమోదీని పరోక్షంగా విమర్శించారు.