
'రచ్చకెక్కుడెందుకు.. పార్టీలో చెప్పొచ్చుగా'
న్యూఢిల్లీ: బిహార్ ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ అగ్రనేత, కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ బహిరంగంగా ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాను విమర్శించడంపట్ల బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు స్పందించారు. అద్వానీ వ్యాఖ్యలపట్ల కాస్తంత అసంతృప్తిని వ్యక్తపరిచిన ఆయన ఇలాంటి వ్యాఖ్యలు పార్టీ ఫోరంలో చేస్తే బాగుంటుందని అన్నారు. 'పార్టీకి ఎల్ కే అద్వానీగారు చేసిన సేవలు మరిచిపోయేవి కావు. పార్టీ అభివృద్ధికి, విస్తరణకు ఆయన చేసిన సేవలు చాలా గొప్పవి. అయితే, ఆయన ఏమైనా చెప్పాలని అనుకుంటే బహిరంగంగా చెప్పడంకంటే పార్టీ ఫోరంలో చెబితే బాగుంటుంది' అని అన్నారు.
అయినా ఆయన వ్యాఖ్యలు సీరియస్ గానే తీసుకుంటున్నామని చెప్పారు. బిహార్ ఎన్నికల ఫలితాల ప్రభావం జాతీయ రాజకీయాలపై ఉండబోదని చెప్పారు. ఈ ఓటమికి ప్రధాని మోదీని విమర్శించడం సరికాదని అన్నారు. బిహార్ ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ కురువృద్ధులు తిరుగుబాటుబావుటా ఎగురవేసిన విషయం తెలిసిందే. ఏడాది కాలంగా పార్టీని నిర్వీర్యం చేసిన తీరే బిహార్‌లో ఓటమికి ప్రధాన కారణమని పార్టీ కురువృద్ధులైన ఎల్.కె.అద్వానీ, మురళీమనోహర్‌జోషి, సీనియర్ నేతలు శాంతకుమార్, యశ్వంత్‌సిన్హా ధ్వజమెత్తారు. ఈ ఓటమికి కారణాలపైనా.. పిడికెడు మంది ముందు పార్టీ సాగిలపడేలా నిర్బంధ పరిస్థితి పైనా.. ఏకాభిప్రాయ స్వభావాన్ని ఎలా ధ్వంసం చేశారన్న దానిపైనా.. సమగ్రమైన సమీక్ష జరిగి తీరాలని ఉద్ఘాటించారు.
ఢిల్లీలో ఘోరపరాజయం నుంచి ఏ పాఠమూ నేర్చుకోలేదని బిహార్ ఎన్నికల ఫలితాలు చూపుతున్నాయని విమర్శించారు. మోదీ గత ఏడాది మే నెలలో పార్టీకి, ప్రభుత్వానికి ఎదురులేని నేతగా అవతరించిన తర్వాత తొలిసారి ఆయన నాయకత్వాన్ని సవాల్ చేస్తూ అద్వానీ తదితరులు మంగళవారం సాయంత్రం కటువైన పదజాలంతో ప్రకటన విడుదల చేశారు. ఈ వ్యాఖ్యలపైనే వెంకయ్యానాయుడు స్పందించారు.