
సమష్టి బాధ్యతే బీజేపీకి ప్రాతిపదిక
బిహార్ ఎన్నికలతో కేంద్రానికి ఇబ్బందేమీ లేదు: వెంకయ్య
సాక్షి, న్యూఢిల్లీ: సమష్టి బాధ్యత, సమష్టి నాయకత్వం ప్రాతిపదికనే బీజేపీ పనిచేస్తుందని కేంద్రమంత్రి ఎం.వెంకయ్య నాయుడు చెప్పారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమేనన్నారు. 2009లో అద్వానీ నాయకత్వంలో ఓటమిపాలైన విషయాన్ని గుర్తుచేశారు. గురువారమిక్కడ ‘పట్టణ రవాణాలో సంస్కరణలు’ పుస్తకావిష్కరణలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బిహార్ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో పార్టీలో సీనియర్ నేతల తిరుగుబాటును కొందరు ప్రస్తావించగా.. ‘ఎన్నికల్లో గెలవడం, ఓడడం జరుగుతూ ఉంటుంది. 2004లో ప్రభుత్వంలో ఉండీ ఓడిపోయాం. అప్పుడు నేను పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నారు. 2009లో అద్వానీ నాయకత్వంలో పోటీ చేశాం. గెలుపొందలేక పోయాం. 2014లో ప్రజలు మోదీ నాయకత్వాన్ని ఆమోదించారు’ అని చెప్పారు. కాగా, దేశవ్యాప్తంగా పట్టణీకరణ పెరిగిపోతోందని వెంకయ్య అన్నారు.‘పట్టణాల్లో జనాభా 2.5 రెట్లు పెరిగితే వాహనాలు 20 రెట్లు పెరుగుతున్నాయి. కనుక ప్రజా రవాణాను ప్రోత్సహించాలి’ అని వివరించారు.
జోషీతో జైట్లీ భేటీ:
బిహార్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి నేపథ్యంలో ప్రధాని మోదీ, పార్టీ చీఫ్ అమిత్‌షాల నాయకత్వంపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన పార్టీ కురువృద్ధుల్లో ఒకరైన మురళీ మనోహర్‌జోషిని.. సీనియర్ నేత, కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ గురువారం కలిశారు. చర్చల వివరాలు తెలియలేదు. అద్వానీ తదితరులను శాంతింపజేసే ఉద్దేశంతోనే జోషిని జైట్లీ కలిసినట్లు భావిస్తున్నారు.