న్యూఢిల్లీ: ఆరేళ్లలోపు పిల్లల ఆరోగ్యంలో కేరళ ప్రథమ స్థానంలో నిలవగా బిహార్ అథమ స్ధానంలో ఉంది. ప్రధానంగా ఆరోగ్యం, పౌష్టికాహారం, ఎదుగుదల అనే మూడు అంశాలతో పాటు, శిశు మరణాల రేటు, ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని రాష్ట్రాలకు స్థానాలను కేటాయించారు. 2005-06 లోని ఫలితాలను 2015-16 నాటి ఫలితాలతో పోలుస్తూ రూపొందించిన ఈ నివేదికను యంగ్ చైల్డ్ అవుట్‌కమ్స్ ఇండెక్స్(వైసీఓఐ) వెల్లడించింది. ఉపరాష్టప్రతి వెంకయ్య నాయుడు శుక్రవారం విడుదల చేసిన 'స్టేట్ ఆప్ ద యూత్ చైల్డ్ ఇన్ ఇండియా' అనే పుస్తకంలో ఈ నివేదిక పొందుపర్చి ఉంది. బాలల ఆరోగ్య, సంక్షేమ సూచీలో 2005-06లో 0.443 పాయింట్లు సాధించిన భారత్ 2015-16కి 0.585 వద్ద స్థిరపడింది. వైసీఓఐ నివేదికలో కేరళ, గోవా రాష్ట్రాలు తొలి రెండు స్థానాల్లో ఉండగా అస్సాం, మేఘాలయ, రాజస్థాన్, చత్తీస్‌ఘడ్, మధ్య ప్రదేశ్, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, బిహార్ చివరి అట్టడుగు స్థానాల్లో ఉన్నాయి. ఈ రాష్ట్రాలు వైసీఈఐ నివేదికలోనూ వెనకబడి ఉండటం గమనార్హం. 2005లో వెనకంజలో ఉన్న త్రిపుర మాత్రం కొంతమేరకు మెరుగుపడింది. (చదవండి: ‘అప్పుడే కొత్త ఆవిష్కరణలకు బీజం పడుతుంది’)
యంగ్ చైల్డ్ ఎన్విరాన్‌మెంట్ ఇండెక్స్: లింగ బేధం, పేదరికం, చదువు, ఆరోగ్యం, మంచినీటి సరఫరా వంటి అంశాల ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. ఇందులో 2015-16కు గానూ భారత్ 0.672 పాయింట్లను సాధించింది. జాతీయ సగటున దాటి కేరళ, గోవా టాప్‌లో ఉండగా అత్యంత తక్కువ పాయింట్లతో జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్ చివరి ఐదు స్థానాల్లో ఉన్నాయి. కాగా దేశంలో ఉన్న 15.9 కోట్ల ఆరేళ్లలోపు చిన్నారుల్లో 21 శాతం మందిలో పోషకాహార లోపం, 36 శాతం మంది తక్కువ బరువుతో ఉండడం, 38 శాతం మందికి టీకాలు అందడం లేదని పుస్తకంలో ఉన్న అంశాలను వెంకయ్య నాయుడు ప్రస్తావించిన విషయం తెలిసిందే. (చదవండి: దేశాభివృద్ధికి చిన్నారుల సంక్షేమమే పునాది)
Comments
Please login to add a commentAdd a comment