
ఏదో పెద్దలు మాట్లాడతారు.. తప్పేముంది
ముంబై: బిహార్ ఎన్నికల్లో కచ్చితంగా తమ పార్టీ ఘన విజయం సాధించి తీరుతుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయడం ద్వారా రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందనే నమ్మకాన్ని బిహార్ ప్రజలు కలిగి ఉన్నారన్నారు. బిహార్‌లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దేశీయ ఇన్వెస్టర్లు ఫలితాలపై దృష్టిపెట్టారన్న విషయంలో ఓ బిజినెస్ ఛానల్‌తో మాట్లాడిన మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఒకవేళ బిహార్ ఎన్నికల్లో ప్రతికూలి ఫలితాలొస్తే అది భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందా అని మీడియా ప్రశ్నించినపుడు ఆయన సమాధానాన్ని దాటవేశారు. ఇంకా ఎన్నికలు నడుస్తున్న నేపథ్యంలో దీనిపై ఏమీ వ్యాఖ్యానించలేనన్నారు. దేశం ఆర్థికంగా బలపడినపుడే ప్రజల అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. బిహార్‌లో సాధించిన విజయం ద్వారా రాజ్యసభలో తమ పార్టీ మరింత బలం పుంజుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
దేశంలో అసహనం పెరుగుతోందన్న వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు. దేశ పెద్దలు, మేధావులు సాధారణంగా ప్రజలకు ఇలాంటి సలహాలు, సూచనలు ఇస్తుంటారని, అందులో తప్పేమీ లేదని వెంకయ్య అన్నారు. అంతేకానీ వారు ఏ పార్టీని ఉద్దేశించి కామెంట్ చేయలేదన్నారు. దేశంలో కొన్ని అవాంఛిత పరిణామాలు చోటుచేసుకున్నాయని, వాటితో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. అసలు దేశంలో ఎలాంటి సంక్షోభ వాతావరణం లేదన్నారు.
అవార్డులను వెనక్కి ఇవ్వడంపై స్పందించిన వెంకయ్యనాయుడు ఈ విషయంలో తనకేమీ అభ్యంతరం లేదన్నారు. దురదృష్టవశాత్తు, గతంలో హింస చెలరేగినపుడు వారు మౌనంగా ఉండి, ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. జరుగుతున్న విషయంతో ప్రధాని మోదీకి లింకు పెట్టాలని చూస్తున్నారని, ఇది సరైంది కాదని మండిపడ్డారు. పరిస్థితులు తొందరలోనే చక్కబడతాయని, దీనికోసం తమ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు. ఈ విషయంలో ప్రధాని మోదీపై తమకు నమ్మకముందని తెలిపారు.