
అద్వానీ, మురళీ మనోహర్ ఔట్
* బీజేపీ పార్లమెంటరీ బోర్డు పునర్‌వ్యవస్థీకరణ
* శివ్‌రాజ్‌సింగ్ చౌహాన్, జేపీ నడ్డాలకు చోటు
* బీజేపీలో అద్వానీ శకం ముగిసినట్లే!
సాక్షి, న్యూఢిల్లీ: కాషాయ దళంలో కొత్త తరం బాధ్యతల స్వీకారం పరిపూర్ణమైంది. నాలుగు దశాబ్దాలుగా పార్టీపై చెరగని ముద్ర వేసిన ‘త్రిమూర్తులు’కు విశ్రాంతి కల్పించారు. బీజేపీలో అత్యున్నత నిర్ణాయక విభాగమైన పార్లమెంటరీ బోర్డులో అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్‌జోషిలను తప్పించారు. పార్టీని అన్నీ తానే అయి నడిపించిన లాల్ కృష్ణ అద్వానీ శకం బీజేపీలో దాదాపుగా ముగిసినట్లే అయింది. 1980 నుంచి పార్టీకి రెండు కళ్లుగా వ్యవహరించిన ఇద్దరిలో వాజ్‌పేయి కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో క్రియాశీల రాజకీయాలకు దూరమైతే.. రామ రథయాత్రతో బీజేపీకి వైభవాన్ని తెచ్చిపెట్టిన అద్వానీ క్రమంగా కనుమరుగు కాక తప్పని పరిస్థితి ఏర్పడింది. వీరిద్దరికీ తోడుగా పార్టీని ప్రభావితం చేసిన మురళీమనోహర్ జోషీకీ ‘విశ్రాంతి’ తప్పలేదు. నూతన కమల దళపతి అమిత్‌షా నేతృత్వంలో 12 మందితో పార్టీ విధాన నిర్ణాయక పార్లమెంటరీ బోర్డు ఏర్పడింది.
దీంతో పాటు కేంద్ర ఎన్నికల కమిటీలను పునర్‌వ్యవస్థీకరించారు. మంగళవారం ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ వివరాలను వెల్లడించారు. అయితే విశ్రాంతినిచ్చిన ఈ ముగ్గురు నేతల సేవలను వినియోగించుకోడానికి కొత్తగా ఓ మార్గదర్శక మండలిని ఏర్పాటు చేసి మమ అనిపించారు. ఐదుగురు సభ్యులుండే ‘మార్గదర్శక్ మండల్’లో వీరికి స్థానం కల్పించారు. పార్టీ కి సలహాలివ్వటం ఈ మండలి పని. ఈ ముగ్గురితో పాటు మోడీ, రాజ్‌నాథ్‌లూ ఈ మండలిలో సభ్యులుగా ఉంటారు. మూడుసార్లు రాష్ట్రంలో పార్టీని అధికారంవైపు నడిపించిన మధ్యప్రదేశ్ సీఎం శివ్‌రాజ్‌సింగ్ చౌహాన్, ప్రధాన కార్యదర్శి జేపీ నడ్డాలకు కొత్తగా పార్టీపార్లమెంటరీ బోర్డులో చోటు దక్కింది. పార్టీ అగ్రనేతలు, ప్రధాని నరేంద్రమోడీతో చర్చించిన అనంతరం కమళదళం నూతన సారథి అమిత్ షా ఈ మార్పులు చేపట్టారు. ప్రతి విభాగంలోనూ ప్రధాని మోడీ ముద్ర స్పష్టంగా కనిపించింది.
- అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్ధులను ఖరారు చేసే పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీని 15 మందికి కుదించారు.
- రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో కేంద్ర ఎన్నికల కమిటీలో సభ్యుల సంఖ్య 19 ఉండగా, కొత్త అధ్యక్షుడు అమిత్‌షా సభ్యుల సంఖ్యను 15కు పరిమితం చేశారు.
- బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా విజయ రాహత్‌కర్ నియమితులయ్యారు.
- కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఓర్నంకు 15 మంది సభ్యులు ఉండే పార్టీ ఎన్నికల కమిటీలో చోటు కల్పించారు. ఈ కమిటీ నుంచి యూపీ నేత వినయ్ కతియార్‌ను తప్పించారు.
పార్లమెంటరీ బోర్డు
అమిత్ షా, నరేంద్రమోడీ, రాజ్‌నాథ్‌సింగ్, అరుణ్‌జైట్లీ, సుష్మా స్వరాజ్, వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కారీ, అనంత్‌కుమార్, థావర్‌చంద్ గెహ్లాట్, శివరాజ్‌సింగ్ చౌహాన్, జగత్ ప్రకాష్ నడ్డా, రామ్‌లాల్
మార్గదర్శక మండలి
ఏబీ వాజ్‌పేయి, ఎల్‌కే అద్వానీ, మురళీమనోహర్‌జోషి, నరేంద్రమోడీ, రాజ్‌నాథ్‌సింగ్
పార్టీ ఎన్నికల కమిటీ
అమిత్ షా (అధ్యక్షుడు), నరేంద్ర మోడీ, రాజ్‌నాథ్ సింగ్, అరుణ్‌జైట్లీ, సుష్మా స్వరాజ్, వెంకయ్య, నితిన్ గడ్కారీ, అనంత్‌కుమార్, థావర్‌చంద్ గెహ్లాట్, శివరాజ్ సింగ్ చౌహాన్, జగత్ ప్రకాశ్ నడ్డా, రామ్‌లాల్, జూయల్ ఓరం, షానవాజ్ హుస్సేన్, విజయ రహాట్కర్