ఆ రోజుల్లో స్మృతి..
రాజకీయాల్లోకి రాకముందు స్మృతి ఇరానీ పాపులర్ టీవీ ఆర్టిస్ట్గా అందరికీ తెలుసు. మరి అంతకన్నా ముందు? మిస్ ఇండియా కాంపిటీషన్లో పాల్గొని ఫైనలిస్ట్లలో ఒకరిగా నిలిచిన మోడల్. స్మృతి యుక్త వయస్సులో ఉన్నప్పటి కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో తిరుగుతూ మరోసారి ఆమె గతం మీద ఆసక్తిని రేపుతున్నాయి.
ఇంటి ఆర్థిక పరిస్థితుల కారణంగా స్మృతి 16 ఏళ్ల వయసులోనే ఢిల్లీలో సౌందర్య సాధనాలు మార్కెటింగ్ చేసే ఓ ఉద్యోగం చేసేదట. దూరవిద్యలో చదువు కొనసాగించేది. తన స్నేహితురాలి సలహాతో తన ఫొటోని ఎవరికీ తెలియకుండా మిస్ ఇండియా పోటీలకు పంపింది. మొదటి వడపోతలో ఎంపికైన తర్వాత తదుపరి పోటీల కోసం ముంబై వెళ్లాల్సి వచ్చింది. అప్పు చేసి పంపించారు తల్లిదండ్రులు.
అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఫైనల్స్ వరకు చేరుకుంది. అయితే కిరీటం మాత్రం చేజారింది... కానీ ఆత్మవిశ్వాసం ఆమెతోనే ఉంది. చేసిన అప్పు తీర్చేందుకు తక్షణమే బాంద్రాలోని ఓ రెస్టారెంట్లో ఉద్యోగానికి చేరింది. అక్కడ టేబుళ్లు శుభ్రం చేయడం దగ్గరి నుంచి ఆర్డర్లు సప్లై చేయడం వరకు అన్ని పనులు చేసేది. మరోవైపు మోడలింగ్లో అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరుగుతుండేది.
అలా తొలిసారి టీవీలో ఓ చిన్న ప్రకటనలో మెరిసింది.. ఆ తర్వాత ఓ ఆల్బమ్, రెండు టీవీ సిరీస్లలో కనిపించింది. ఆ కార్యక్రమాలను శోభా కపూర్ చూడటం.. తన కుమార్తె ఏక్తాకు స్మృతి గురించి చెప్పడం జరిగాయి. ఏక్తా డైలీ సీరియల్ 'క్యోంకీ సాస్ భీ కభీ బహూ థీ' లో తులసి పాత్ర స్మృతి జీవితాన్నే మలుపు తిప్పింది. కట్ చేస్తే... మిగిలిన కథ అందరికీ తెలిసిందే.
ప్రస్తుతం ఎంపీగా, చేనేత, జౌళి శాఖ మంత్రిగా పనిచేస్తున్న ఆమె... చిన్నప్పటి నుంచి జీవితాన్ని చాలెంజింగ్ తీసుకుని పోరాడింది. మోడల్గా ఉన్నప్పటి స్మృతి ఫొటోలు నెట్టింట్లో కనిపించి ఆమె ప్రయాణాన్ని తెలుసుకునేలా చేస్తున్నాయి.