కోల్‌కత/న్యూఢిల్లీ : ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థులపై దాడి ఘటనను దేశవ్యాప్తంగా ప్రజలు ఖండిస్తుండగా పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జేఎన్‌యూ స్టూడెంట్ లీడర్ ఆయిషీ ఘోష్ తలపై ఉన్నది రక్తమా... లేక పెయింటా..? అని చవకబారుగా మాట్లాడారు. కాగా, ముసుగులు ధరించిన దుండుగులు చేతిలో కర్రలతో యూనివర్సిటీలోకి చొరబడి పలువురు విద్యార్థులు, టీచర్లపై ఆదివారం దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో జేఎన్‌యూ కాంగ్రెస్ విద్యార్థి యూనియన్ ప్రెసిడెంట్ (జేఎన్‌యూఎస్‌యూ) ఆయిషీ ఘోష్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయిషీ ఘోష్ సహా 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనలో వర్సిటీ ఆస్తులు కూడా ధ్వంసమయ్యాయి.
(చదవండి : జేఎన్‌యూలో దీపిక)
‘చదువులను గాలికొదిలేసి విద్యార్థులంతా రోజూ ఇదే అంశాన్ని లేవనెత్తుతూ నిరసనలకు దిగుతున్నారు. ఇంతకూ ఆయిషీ ఘోష్ తలపై ఉన్నది రక్తమేనా.. లేక ఎరుపు రంగా..? ఇదంతా కావాలనే చేస్తున్నట్టుగా ఉంది’అని దిలీప్ ఘోష్ మంగళవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ అన్నారు. కాగా, ఆయిషీ తల్లి షర్మిష్ఠా ఘోష్ మాట్లాడుతూ.. ‘బీజేపీ నేత దిలీప్ వ్యాఖ్యలపై స్పందించాలంటేనే కంపరంగా ఉంది. జేఎన్‌యూలో పరిస్థితులు మెరుగు పడకుంటే.. ప్రస్తుతం ఉన్న వీసీనే ఇంకా కొనసాగితే.. అక్కడ చదువుకోవడానికి పిల్లల్ని అనుమతించం’ అన్నారు. దిలీప్ కాస్త మనిషిగా ఆలోచిస్తే మంచిదని బెంగాల్ విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీ హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment