జేఎన్‌యూపై ‘నాజీ’ తరహా దాడి..! | Sangh Parivar Forces must Withdraw Game of Bloodshed, Says Kerala CM | Sakshi
Sakshi News home page

జేఎన్‌యూపై ‘నాజీ’ తరహా దాడి..!

Published Mon, Jan 6 2020 12:19 PM | Last Updated on Mon, Jan 6 2020 12:29 PM

Sangh Parivar Forces must Withdraw Game of Bloodshed, Says Kerala CM - Sakshi

న్యూఢిల్లీ: జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో చోటుచేసుకున్న హింసపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. పలువురు ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు క్యాంపస్‌లో చోటుచేసుకున్న హింసాత్మక దాడులను ఖండిస్తున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్పందిస్తూ దేశంలో పెరిగిపోతున్న అసహనానికి ఈ దాడులు నిదర్శనమని పేర్కొన్నారు.

‘విద్యార్థులపై జరిగిన భీకరమైన దాడి.. అసహనానికి నిదర్శనం. జేఎన్‌యూ క్యాంపస్‌లో విద్యార్థులు, టీచర్లపై ‘నాజీ స్టైల్‌’లో దాడి జరిగింది. దేశంలో హింస, అశాంతి సృష్టించాలనుకునేవాళ్లే ఇలాంటి దాడులు చేస్తారు’ అని పినరయి ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘క్యాంపస్‌లో రక్తపాతాలు సృష్టించే ఇలాంటి ప్రమాదకరమైన ఆటలు ఆడటాన్ని సంఘ్‌ పరివార్‌ శక్తులు ఇప్పటికైనా ఆపాలి. విద్యార్థుల గొంతు.. ఈ దేశ గొంతుగా వారు ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది’ అని అన్నారు.

జేఎన్‌యూ క్యాంపస్‌లో దాడుల నేపథ్యంలో క్యాంపస్‌ విద్యార్థులకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ సంఘీభావం ప్రకటించారు. విద్యార్థులు సాహసోపేతంగా వ్యవహరిస్తూ.. నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నందుకే వారిని ‘శిక్షించేందుకు’ ఈ ​క్రూరమైన దాడులు జరిగాయని ఒవైసీ ఆరోపించారు. కేంద్ర మంత్రులు కూడా నిస్సహాయత వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేస్తున్నారని, పోలీసులు ఎందుకు గూండాలకు రక్షణగా ఉన్నారో మోదీ సర్కార్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. జేఎన్‌యూలో దాడులను బీఎస్పీ అధినేత్రి మాయావతి ఖండించారు. ఈ దాడులను కేంద్రం సీరియస్‌గా తీసుకోవాలని, దీనిపై జ్యుడీషియల్‌ విచారణ జరిపితే మంచిదని ఆమె సూచించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement