సాక్షి, ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ముంబై వాసులపై ఏమాత్రం కనికరం చూపకుండా తీవ్ర ప్రతాపం చూపుతోంది. మరోవైపు మహారాష్ట్ర వ్యాప్తంగానూ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక ముంబైలో కరోనా వైరస్ బాధితులతో ఆస్పత్రులన్నీ ఇప్పటికే నిండిపోయాయి. ఈ క్రమంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ముంబైలోని చారిత్రాత్మక వాంఖేడి స్టేడియాన్ని క్వారెంటైన్ కేంద్రంగా మార్చుకోవాలని నిర్ణయించింది. వీలైనంత తొందరగా మైదానాన్ని తమకు అప్పగించాలని మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశించింది. ఈ మేరకు ముంబై క్రికెట్ అసోషియేషన్ (ఎంసీఏ)కు ఓ లేఖ రాసింది. కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు తమకు స్టేడియాన్ని అప్పగించాలని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ చందనా జాదవ్ కోరారు. (లాక్‌డౌన్ 4:0: నేడు కొత్త మార్గదర్శకాలు)
అంతేకాకుండా ముంబై మున్సిపాలిటీ పరిధిలోని హోటల్స్, లాడ్జ్, క్లబ్స్, కాలేజీలు, పంక్షన్ హాల్స్ మొదలైన వాటిని కూడా తమ ఆధీనంలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆయా యాజమాన్యాలకు నోటీసులు జారీచేసింది. వీటిలో కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్న డాక్టర్లకు వసతి కల్పించాలని బీఎంసీ భావిస్తోంది. అలాగే వైరస్ బాధితులు నానాటికీ పెరుగుతుండటంతో వాటిల్లో క్వారెంటైన్ కేంద్రాలని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కాగా మహారాష్ట్రంలో ఇప్పటి వరకే 29,100 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... వైరస్ సోకి 1,068 మంది మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలోనే లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగించింది. (లాక్‌డౌన్ 4.0: అమిత్ షా కీలక భేటీ)
Comments
Please login to add a commentAdd a comment