విజయోత్సవ ర్యాలీలో బాంబు పేలుడు
కన్నూర్: కేరళలో సీపీఎం నాయకుడు పినరయి విజయన్ ర్యాలీలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కనీసం ఒకరు మృతి చెందినట్టు వార్తలు వచ్చాయి. ఎల్డీఎఫ్ విజయాన్ని పురస్కరించుకుని కన్నూరు జిల్లాలోని పినరయిలో ర్యాలీ నిర్వహిస్తుండగా ఈ సంఘటన జరిగింది. గుర్తు తెలియని దుండగులు బాంబు విసిరినట్టు తెలుస్తోంది.
బాంబు పేలుడుతో అక్కడున్నవారంతా భయంతో పరుగులు పెట్టారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇది ఆర్ఎస్ఎస్ శక్తుల పనేనని ఎల్డీఎఫ్ నాయకులు ఆరోపించారు. ముఖ్యమంత్రి రేసులో ముందున్న విజయన్ పాల్గొన్న ర్యాలీలో బాంబు పేలుడు జరగడంతో కలకలం రేగింది.
తాజాగా వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార యూడీఎఫ్ కూటమి ఓడిపోగా, ఎల్డీఎఫ్ మెజారిటీ స్థానాల్లో విజయం సాధించింది. కాగా, సీఎం అభ్యర్థి పేరును రేపు ఖరారు చేస్తామని సీపీఎం నేడు ప్రకటించింది.