
అమిత్ షా మీటింగ్.. విమానయాన శాఖకు నోటీసులు
పనాజి: ఎయిర్‌పోర్టులోని నిషేధిత ప్రాంతంలో పబ్లిక్ మీటింగ్ నిర్వహించడానికి అనుమతించినందుకు పౌర విమానయాన శాఖకు బాంబే హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు సోషల్ యాక్టివిస్ట్ ఏరిస్ రోడ్రిగ్స్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 1వ తేదీన గోవా ఎయిర్‌పోర్టులోని నిషేధిత ప్రదేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పబ్లిక్ మీటింగ్ నిర్వహించారనేది పిటిషనర్ వాదన.
పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ పౌర విమానయాన శాఖ కార్యదర్శి, గోవా ప్రధానకార్యదర్శి, గోవా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఎయిర్‌పోర్టు డైరెక్టర్, డిప్యూటీ కమాండెంట్ ఆప్ సీఐఎస్‌ఎఫ్‌లను ఆదేశించింది. ఈ నెల 1వ తేదీని రెండు రోజుల గోవా పర్యటనకు వెళ్లిన అమిత్ షా.. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్, కేంద్రమంత్రి శ్రీపాద్ నాయక్‌ల సమక్షంలో ఎయిర్‌పోర్టు కాంప్లెక్స్‌లో పబ్లిక్ మీటింగ్ నిర్వహించారనే ఆరోపణలు ఉన్నాయి.
కోర్టులో పిటిషన్ దాఖలుకు ముందు రోడ్రిగ్స్.. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, గోవా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పోలీసు చీఫ్‌లకు ఫిర్యాదు చేశారు. కాగా, కోర్టు నోటీసుల జారీపై మాట్లాడిన బీజేపీ.. మీటింగ్ కోసం ముందుగా అనుమతి తీసుకున్నట్లు చెప్పింది. అయితే, నిషేధిత ప్రాంతంలో మీటింగ్ నిర్వహించలేదని పేర్కొంది. కొద్దిసేపటి తర్వాత మళ్లీ ప్రకటన విడుదల చేసిన బీజేపీ.. అసలు అక్కడ సమావేశమే ప్లాన్ చేయలేదని మాట మార్చింది. అమిత్ షాను చూసిన ఎయిర్‌పోర్టులోని ప్రయాణీకులు అక్కడ గుమిగూడారని పేర్కొంది.