మద్యం దొరక్క సబ్బు తినేశాడు
పాట్నా: మద్యనిషేధం బిహార్‌లోని మందుబాబులను కలవర పెడుతోంది. దేశీయంగా తయారయ్యే విదేశీ మద్యం(ఐఎంఎఫ్‌ఎల్) సహా రాష్ట్రంలో మద్యం(ఆల్కహాల్) విక్రయాలు, వినియోగంపై నితీశ్ కుమార్ ప్రభుత్వం మంగళవారం పూర్తి నిషేధాన్ని విధించింది. ఆ తర్వాత ఆసుపత్రుల్లో మందు బానిసల తాకిడి విపరీతంగా పెరిగింది.
బుధవారం వరకు అధికారులు తెలిపిన లెక్కల ప్రకారం మద్యం దొరక్క 750 మందికి పైగా ఆనారోగ్యం బారిన పడ్డారు. కొందరు వింత వింతగా ప్రవర్తిస్తుంటే, మరికొందరు కుటుంబ సభ్యులను కూడా గుర్తు పట్టలేక పోతున్నారు. మద్యం దొరక్క ఏం చేయాలో అర్థం కాక ఓ వ్యక్తి సబ్బుల మీద సబ్బులు లాగించేస్తున్నాడు. దీనికి సంబంధించి వీడియో అక్కడి లోకల్ చానళ్లలో చెక్కర్లు కొడుతోంది. మందు బానిసల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా 38 కొత్త డి-అడిక్షన్ సెంటర్‌లను ప్రారంభించింది.
అడిక్షన్ సెంటర్‌లకు వచ్చే వారిలో కొందరు వణుకుతూ, కనీసం నిలబడలేకపోతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. ప్రతి రోజు ఎక్కువ మొత్తంలో మద్యం సేవించే వారిలోనే ముఖ్యంగా ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని డాక్టర్లు తెలిపారు.