ఆ తల్లికి క్యాబ్ డ్రైవర్ ఐదు గంటల నరకం!
న్యూఢిల్లీ: ఢిల్లీలోని నార్త్-వెస్ట్ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. ఓ క్యాబ్ డ్రైవర్ నిర్లక్ష్యంతో పాటు అతడు చేసిన మోసానికి తల్లి కళ్లముందే ఓ నాలుగేళ్ల బాలుడు నరకం అనుభవించి, మృతిచెందాడు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. వాయవ్య ఢిల్లీలోని ముఖర్జీ నగర్ లో ఈకో క్యాబ్ డ్రైవర్ రాహుల్(32) తన కారును నిర్లక్ష్యంగా రివర్స్ తీస్తూ ఇంటి ముందు ఆడుకుంటున్న రోహిత్ కుమార్(4)ను ఢీకొట్టాడు. వెంటనే అక్కడినుంచి తప్పించుకోవాలని ప్రయత్నించగా, స్థానికులు క్యాబ్ డ్రైవర్ ను పట్టుకుని బాబును హాస్పిటల్ కు తీసుకెళ్లాలని హెచ్చరించారు.
రోహిత్, ఆమె తల్లి వాసంతి కుమారిని తన క్యాబ్ లో ఎక్కించుకున్నాడు. గంటలు గడుస్తున్నాయి.. కానీ బాబుని ఆస్పత్రిలో చేర్చడం లేదు. యాక్సిడెంట్ తాను చేశానని హాస్పిటల్ లో చెప్పవద్దని, ఎవరికైనా విషయం చెబితే చంపేస్తానని బెదిరించాడు. కుమారుడి ప్రాణం ముఖ్యమనుకున్న ఆ తల్లి అందుకు ఒప్పుకుంది. అయినా ఏదో మూల అనుమానం ఉన్న క్యాబ్ డ్రైవర్ దాదాపు నాలుగు ఆస్పత్రులకు తీసుకెళ్లాడని.. అయితే ప్రతిసారి ఒకే సమాధానం ‘ బాబును ఇక్కడ చేర్చుకోనని చెబుతున్నారు’ అంటూ చెప్పాడు. ఆ సమయంలో కుమారిడితో పాటు తాను కారులో ఉన్నానని వాసంతి తెలిపింది. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము ఐదున్నర గంటల వరకు కారులో తిప్పుతూనే ఉన్నాడని, తన బిడ్డ ప్రాణాలు పోతాయని వేడుకున్నా వినలేదని తన ఫిర్యాదులో వాసంతి పేర్కొంది. బాబుతో పాటు తానూ ఐదు గంటల నరకం చూశానని తల్లి వాపోయింది. క్యాబ్ లోనే బాబు చనిపోయిన వెంటనే రోడ్డుపైనే వదిలేసి క్యాబ్ డ్రైవర్ వెళ్లిపోయాడు.
శనివారం ఉదయం ఆరు గంటలకు పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి భర్త భవేశ్ కుమార్ కు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పింది. భర్తతో కలిసి ఆస్పత‍్రికి వెళ్లగా అప్పటికే బాలుడు చనిపోయాడని డాక్టర్లు నిర్దారించారు. ’తమ్ముడు ఎక్కడున్నాడని తన మిగతా ముగ్గురు పిల్లలు అడిగితే నేను ఏం చెప‍్పాలి’ అంటూ రోహిత్ తల్లి వాసంతి కన్నీరుమున్నీరయింది. శనివారం రాత్రి బాలుడి తల్లిదండ్రులు తమకు ఫిర్యాదు చేశారని ఢిల్లీ నార్త్ ఈస్ట్ జోన్ డీసీపీ మిలింద్ దుంబీర్ చెప్పారు. కేసు నమోదు చేశామని, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని డీసీపీ వివరించారు.