Eeco cab
-
ఎగబడి మరీ 'మారుతి ఈకో' కొంటున్న జనం.. అమ్మకాల్లో అరుదైన రికార్డ్!
మారుతి సుజుకి ఈకో గత కొన్ని సంవత్సరాలు మార్కెట్లో తిరుగులేని అమ్మకాలతో పరుగులు పెడుతోంది. ఇప్పటికే విడుదలైన కొన్ని నివేదికల గణాంకాల ప్రకారం 'ఈకో' 10 లక్షల యూనిట్ల అమ్మకాలను తన ఖాతాలో వేసుకుంది. భారతదేశంలో మారుతి ఈకో కేవలం ప్రయాణ వాహనంగా మాత్రమే కాకుండా, వ్యాపార వినియోగాలకు కూడా ఉపయోగపడుతోంది. ఈ కారణంగానే అతి తక్కువ కాలంలోనే దేశంలో ఎక్కువ అమ్మకాలు పొందిన వ్యాన్‌గా రికార్డ్ సృష్టించింది. ఇది 5 సీటర్, 7 సీటర్, కార్గో, టూర్, అంబులెన్స్ వంటి దాదాపు 13 వేరియంట్లలో అందుబాటులో ఉంది. మార్కెట్లో వ్యాన్ అమ్మకాలలో మారుతి ఈకో 94 శాతం వాటా కలిగి ఆ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తోంది. మొదటి 5 లక్షల యూనిట్లను విక్రయించడానికి 8 సంవత్సరాలు పడితే, మరో 5 లక్షల కార్లు విక్రయించడానికి ఐదేళ్ల కంటే తక్కువ సమయం పట్టింది. దీన్ని బట్టి చూస్తే ఈకో అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయని స్పష్టమవుతోంది. (ఇదీ చదవండి: ముదురుతున్న ఎండలు: కారుని కాపాడుకోడం ఎలా? ఇవిగో సింపుల్ టిప్స్) మారుతి సుజుకి ఈకో 1.2-లీటర్, K12C, డ్యూయల్ జెట్, డ్యూయల్ వివిటి, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్ కలిగి 80 బిహెచ్పి పవర్ & 104.4 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. CNG వెర్షన్ 71 బిహెచ్పి, 95 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. రెండు ఇంజిన్లు 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటాయి. పెట్రోల్ మోడల్ 20.20 కిమీ/లీ మైలేజ్ అందిస్తే, CNG మోడల్ 27.05 కిమీ/కేజీ అందిస్తుంది. 'మారుతి ఈకో'లో రిక్లైనింగ్ ఫ్రంట్ సీట్లు, డ్రైవర్ ఫోకస్డ్ కంట్రోల్స్ వంటి ఫీచర్స్ మాత్రమే కాకుండా.. ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఇంజిన్ ఇమ్మొబిలైజర్, ఇల్యూమినేటెడ్ హజార్డ్ స్విచ్, ఏబీఎస్ విత్ ఈబిడి వంటి 11 కంటే ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. -
సరికొత్తగా మారుతి ఈకో
దేశీయ కారు మేకర్ మారుతి తనపాపులర్ మోడల్ ఈకో క్యాబ్ ఆరును కొత్తగా తీర్చి దిద్దింది. రానున్న భద్రతా నిబంధనలకనుగుణంగా బేసిక్ భద్రతా ఫీచర్లతో సరికొత్తగా లాంచ్ చేసింది. ఈ అప్డేటెడ్ మోడల్ వాహనం ధరను రూ. 3.55 లక్షలుగా (ఎక్స్ షో రూం ఢిల్లీ) గతంకంటే రూ.23వేల దర పెంచింది. 1.2 పెట్రోల్ ఇంజీన్, సీఎన్జీ వేరియంట్లలో ఈ కారు లభ్యం కానుంది. 73 పవర్, 101 గరిష్ట టార్క్ ఫీచర్లకు తోడు డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్, ఫ్రంట్, రియర్ పార్కింగ్ సెన్సర్లు, స్పీడ్ అలర్ట్ తదితర ఫీచర్లను అదనంగా జోడించింది. -
ఆ తల్లికి క్యాబ్ డ్రైవర్ ఐదు గంటల నరకం!
న్యూఢిల్లీ: ఢిల్లీలోని నార్త్-వెస్ట్ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. ఓ క్యాబ్ డ్రైవర్ నిర్లక్ష్యంతో పాటు అతడు చేసిన మోసానికి తల్లి కళ్లముందే ఓ నాలుగేళ్ల బాలుడు నరకం అనుభవించి, మృతిచెందాడు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. వాయవ్య ఢిల్లీలోని ముఖర్జీ నగర్ లో ఈకో క్యాబ్ డ్రైవర్ రాహుల్(32) తన కారును నిర్లక్ష్యంగా రివర్స్ తీస్తూ ఇంటి ముందు ఆడుకుంటున్న రోహిత్ కుమార్(4)ను ఢీకొట్టాడు. వెంటనే అక్కడినుంచి తప్పించుకోవాలని ప్రయత్నించగా, స్థానికులు క్యాబ్ డ్రైవర్ ను పట్టుకుని బాబును హాస్పిటల్ కు తీసుకెళ్లాలని హెచ్చరించారు. రోహిత్, ఆమె తల్లి వాసంతి కుమారిని తన క్యాబ్ లో ఎక్కించుకున్నాడు. గంటలు గడుస్తున్నాయి.. కానీ బాబుని ఆస్పత్రిలో చేర్చడం లేదు. యాక్సిడెంట్ తాను చేశానని హాస్పిటల్ లో చెప్పవద్దని, ఎవరికైనా విషయం చెబితే చంపేస్తానని బెదిరించాడు. కుమారుడి ప్రాణం ముఖ్యమనుకున్న ఆ తల్లి అందుకు ఒప్పుకుంది. అయినా ఏదో మూల అనుమానం ఉన్న క్యాబ్ డ్రైవర్ దాదాపు నాలుగు ఆస్పత్రులకు తీసుకెళ్లాడని.. అయితే ప్రతిసారి ఒకే సమాధానం ‘ బాబును ఇక్కడ చేర్చుకోనని చెబుతున్నారు’ అంటూ చెప్పాడు. ఆ సమయంలో కుమారిడితో పాటు తాను కారులో ఉన్నానని వాసంతి తెలిపింది. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము ఐదున్నర గంటల వరకు కారులో తిప్పుతూనే ఉన్నాడని, తన బిడ్డ ప్రాణాలు పోతాయని వేడుకున్నా వినలేదని తన ఫిర్యాదులో వాసంతి పేర్కొంది. బాబుతో పాటు తానూ ఐదు గంటల నరకం చూశానని తల్లి వాపోయింది. క్యాబ్ లోనే బాబు చనిపోయిన వెంటనే రోడ్డుపైనే వదిలేసి క్యాబ్ డ్రైవర్ వెళ్లిపోయాడు. శనివారం ఉదయం ఆరు గంటలకు పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి భర్త భవేశ్ కుమార్ కు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పింది. భర్తతో కలిసి ఆస్పత్రికి వెళ్లగా అప్పటికే బాలుడు చనిపోయాడని డాక్టర్లు నిర్దారించారు. ’తమ్ముడు ఎక్కడున్నాడని తన మిగతా ముగ్గురు పిల్లలు అడిగితే నేను ఏం చెప్పాలి’ అంటూ రోహిత్ తల్లి వాసంతి కన్నీరుమున్నీరయింది. శనివారం రాత్రి బాలుడి తల్లిదండ్రులు తమకు ఫిర్యాదు చేశారని ఢిల్లీ నార్త్ ఈస్ట్ జోన్ డీసీపీ మిలింద్ దుంబీర్ చెప్పారు. కేసు నమోదు చేశామని, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని డీసీపీ వివరించారు.