నిర్లక్ష్యంగా బండిని రివర్సు చేసిన డ్రైవర్
జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
హైదరాబాద్: ముక్కుపచ్చలారని చిన్నారిని స్కూలు బస్సు చిదిమేసింది. నాన్న వేలు విడిచి బడిలోకి అడుగు పెట్టీపెట్టగానే డ్రైవర్ నిర్లక్ష్యం నిండు ప్రాణాలను బలి తీసుకుంది. టాటా అంటూ చివరిసారిగా చెప్పిన ముద్దుముద్దు మాటలు అమ్మ చెవిలో రింగుమంటుంటే... బిడ్డను వదిలిన క్షణాల్లోనే ప్రమాద వార్త విని తండ్రి కళ్లల్లో నీళ్లు కట్టలు తెంచుకున్నాయి.
హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధి ప్రసూననగర్‌లో నివసించే రాంరెడ్డి, సుశీల దంపతుల ఇద్దరి సంతానంలో పెద్దవాడు నాలుగేళ్ల జశ్వంత్‌రెడ్డి. న్యూవివేకానందనగర్ ‘విజ్ఞానసుధ ట్యాలెంట్ స్కూల్’లో యూకేజీ చదువుతున్నాడు. వీరి స్వస్థలం ప్రకాశం జిల్లా తుళ్లూరు మండలం తురకపాలెం. కాగా, బాచుపల్లిలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసే రాంరెడ్డి శుక్రవారం జస్వంత్‌ను స్కూల్ వద్ద వదిలి వెళ్లారు. గేటు లోపలకు వెళ్లీవెళ్లగానే ఆవరణలో రివర్స్ చేస్తున్న అదే స్కూలు వ్యాన్ (ఏపీ 28 టీఏ 3437) చిన్నారిని వెనక నుంచి ఢీకొట్టింది.
అక్కడ ఉన్నవారంతా కేకలు పెడుతున్నా డ్రైవర్ పట్టించుకోకుండా వ్యాన్‌ను రివర్స్‌లో వేగంగా పోనిచ్చాడు. దీంతో బాలుడి తల, ఛాతికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని సూరారం మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించారు. బడి వద్ద వదిలిన కొద్ది నిమిషాల్లోనే ప్రమాద వార్త విని ఆస్పత్రికి వెళ్లిన రాంరెడ్డి తన బిడ్డ శవాన్ని చూసి షాకయ్యారు. నా కొడుకు లేనిదే బతకలేనంటూ గుండెలవిసేలా రోదించిన తల్లి సొమ్మసిల్లి పడిపోయింది. వారి కడుపు శోకం చూసినవారి కళ్లు చెమర్చాయి. తల్లిదండ్రులు స్కూలు వద్ద ఆందోళనకు దిగారు. వారికి స్థానిక నాయకులు, సంఘాలవారు మద్దతు తెలిపారు.
నిలువునా నిర్లక్ష్యం...
ఉదయం 8.30 నుంచి 9 గంటల వరకూ విద్యార్థులు క్లాస్ రూముల్లోకి వెళతారు. ఆ సమయంలో ఆవరణలోకి స్కూలు బస్సులను అనుమతించరు. కానీ, పార్కింగ్ చేసేందుకు డ్రైవర్ శ్రీశైలం వ్యాన్‌ను రివర్స్‌లో ఆవరణలోకి తీసుకెళ్లి ప్రమాదానికి కారణమయ్యాడు. పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాస్‌రెడ్డి పోలీసుల సమక్షంలో బాలుడి తల్లిదండ్రులకు రూ.5 లక్షల చెక్కును పరిహారంగా అందించారు. డ్రైవర్ శ్రీశైలంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చిన్నారిని చిదిమేసిన స్కూలు వ్యాన్
Published Sat, Jun 18 2016 4:34 AM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM
Advertisement