సాక్షి, శ్రీనగర్ : పాకిస్తాన్ తన దొంగబుద్ధిని మరోచూపించుకుంది. ఇప్పటికే పలుసార్లు.. సరిహద్దునుంచి భారత్‌లోకి సొరంగాలు తవ్వి పట్టుబడింది. అంతర్జాతీయ సమాజం ముందు ఛీత్కరింపులు.. అవమానాలు ఎదురయినా నా బుద్ధి కుక్కబుద్ధేనని పాకిస్తాన్ ప్రకటించుకుంది. తాజాగా కశ్మీర్‌లోని ఆర్‌ఎస్ పురా సెక్టార్‌లోని ఆర్నియా ప్రాంతంలో పాకిస్తాన్ నిర్మించిన సొరంగాన్ని బీఎస్‌ఎఫ్ బలగాలు గుర్తించాయి. పాకిస్తాన్ రేంజర్లు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సమావేశం ముగిసిన కొన్ని గంటల్లోనే.. ఇది బయటపడ్డం యాధృచ్ఛికం అని సీనియర్ బీఎస్‌ఎఫ్ అధికారి ఒకరు చెబుతున్నారు.
పాకిస్తాన్ సరిహద్దు నుంచి భారత భూభాగంలోకి మిలిటెంట్లు వచ్చేందుకు 14 అడుగుల పొడవుతో దీనిని నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ సొరంగం గుండా మిలిటెంట్లు ఆయుధాలతో పాక్కుంటూ సరిహద్దులు దాటి సులువుగా వచ్చేందుకు అవకాశం ఉందని బీఎస్‌ఎఫ్ అధికారులు తెలిపారు. దేశంలో ఇక పండుగల హడావుడి మొదలైన నేపథ్యంలో ఈ సొరంగం గుండా మిలిటెంట్లు దేశంలోకి చొరబడి.. అల్లర్లు, విధ్వంసం సృష్టించేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నట్లుగా తెలుస్తోంది.
ముగ్గురు నలుగురు పాకిస్తాన్ వ్యక్తులు సొరంగంలో పనులు చేస్తున్నట్లు అనుమానాలు రావడంతో బీఎస్‌ఎఫ్ బలగాలు కాల్పులకు దిగాయి. కొద్దిసేపు ఎదురుకాల్పులు జరిపిన వాళ్లు.. తరువాత పాకిస్తాన్‌కు పారిపోయారు. చొరబాట్లకు అవకాశం లేకపోవడంతో మిలిటెంట్లు సొరంగాలు తవ్వుకుని సరిహద్దులా దాటేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇటువంటి సొరంగాలను గుర్తించేందుకు ఇకపై ఫూల్‌ఫ్రూఫ్ టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు బీఎస్‌ఎఫ్ బలగాలు ప్రకటించాయి.
గతంలో గుర్తించిన సొరంగాలు
- 2012లో సాంబా సెక్టార్‌లో ఒక సొరంగాన్ని అధికారులు గుర్తించారు. మొత్తం 540 మీటర్ల పొడవున్న ఈ సొరంగ మార్గం పాకిస్తాన్‌లోని లుంబ్రియాల్ పోస్ట్ నుంచి మొదలైంది.
- 2014లో అఖ్నూర్ సెక్టార్‌లో పాకిస్తాన్ నిర్మించిన సొరంగాన్ని బీఎస్‌ఎఫ్ బలగాలు గుర్తించాయి. సుమారు 50 మీటర్ల పొడవున్న ఈ సొరంగం పాకిస్తాన్ నుంచి అఖ్నూర్ సెక్టార్‌లోని మున్వర్‌కు ఉంది.
- 2016లో ఆర్‌ఎస్ పురా సెక్టార్‌లో మరో సొరంగం బయటపడింది. ఇది సుమారు 30 మీటర్ల పొడవుతో.. పాకిస్తాన్ సరిహద్దు నుంచి కొథే పోస్ట్ వరకూ ఉంది.
- 2017 ఫిబ్రవరిలో మరో సొరంగాన్ని భద్రతా బలగాలు గుర్తించాయి. పాకిస్తాన్ సరిహద్దు నుంచి సాంబా సెక్టార్ వరకూ దీనిని నిర్మించారు. ఈ సొరంగం గుండానే మిలిటెంట్లు భారీగా దేశంలోకి చొరబడ్డారని భద్రతా బలగాలు గుర్తించాయి.