
బీఎస్పీ అధినేత్రి మాయావతి (ఫైల్‌ఫోటో)
నేనే సీఎం అయితే వారిపై చర్యలు తీసుకున్నాకే టెకీ కుటుంబ సభ్యులను కలుస్తా : మాయావతి
లక్నో : యాపిల్ ఎగ్జిక్యూటివ్ వివేక్ తివారీ మృతి కేసులో బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో జాప్యం జరగడం పట్ల బీఎస్పీ అధినేత్రి మాయావతి యోగి సర్కార్‌పై మండిపడ్డారు. ప్రభుత్వ తీరుతో యూపీలో శాంతిభద్రతల వ్యవస్థ కుప్పకూలినట్టు కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘తాను ముఖ్యమంత్రినైతే ముందుగా టెకీ హత్యకు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకుని, ఆ తర్వాతే బాధిత కుటుంబానికి భరోసా ఇస్తానని, యూపీ సీఎం తరహాలో అందుకు భిన్నంగా వ్యవహరించబో’నని ఆమె స్పష్టం చేశారు.
లక్నోలోని గోమతి ప్రాంతంలో శనివారం రాత్రి మహిళా సహోద్యోగితో కలిసి కారులో వెళుతున్న వివేక్ తివారీ (38)పై పోలీస్ కానిస్టేబుల్ కాల్పులు జరపగా, విండోనుంచి దూసుకెళ్లిన బుల్లెట్ టెకీ ప్రాణాలను బలిగొంది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్ట్ చేశారు. టెకీ మృతిపై విపక్షాల నుంచి యోగి సర్కార్‌పై ముప్పేట దాడి తీవ్రమైంది. మరోవైపు బాధితుడి కుటుంబ సభ్యులు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను కలుసుకున్నారు. ప్రభుత్వం వారికి అన్ని విధాలా సాయం చేస్తుందని ఈ సందర్భంగా సీఎం వారికి భరోసా ఇచ్చారు.