Korutla Death Mystery: కోరుట్ల టెక్కీ దీప్తి కేసులో సరికొత్త ట్విస్ట్‌ | Korutla Death Mystery: Chandana Audio Clip Out, New Twist In Korutla Techie Deepthi Case - Sakshi
Sakshi News home page

Korutla Death Mystery: కోరుట్ల యువతి దీప్తి కేసులో సరికొత్త ట్విస్ట్‌.. చెల్లెలు చందన ఆడియో మెసేజ్‌ బయటకు

Published Wed, Aug 30 2023 2:00 PM | Last Updated on Wed, Aug 30 2023 2:52 PM

Chandana Audio Clip Out New Twist In Korutla Techie Deepthi Case - Sakshi

జగిత్యాల: కోరుట్ల సాఫ్ట్‌వేర్‌ దీప్తి మృతి కేసు ఊహించని మలుపు తిరిగింది. దీప్తి అనుమానాస్పద మృతి తర్వాత ఓ యువకుడితో వెళ్లిపోయిన దీప్తి సోదరి చందన​ పేరిట ఓ ఆడియో క్లిప్‌ బయటకు వచ్చింది. తాము మద్యం సేవించిన మాట వాస్తవమేనని, కానీ తాను అక్కను చంపలేదంటూ.. తన సోదరుడు సాయికి చందన ఆ వాయిస్‌ మెసేజ్‌ పంపినట్లు తెలుస్తోంది.   

‘‘అరేయ్‌ సాయి నేను చందక్కను రా..   నిజమెంటో చెప్పాలారా. దీప్తిక్క నేను తాగుదామనుకున్నాం. కానీ, నేను తాగలేదు. అక్కనే తాగింది. నేను నా ఫ్రెండ్‌ చేత తెప్పించా. అది నేను ఒప్పుకుంటా. కానీ, అక్కనే తాగింది. తాగిన తర్వాత తన బాయ్‌ఫ్రెండ్‌ను పిలుస్తా అంది. నేను వద్దన్నా.. అయినా పిలుస్తా అంటే చివరికి నీ ఇష్టం సరే అన్నా.. 

నేను ఇంట్లోంచి వెళ్లిపోదాం అనుకున్నాం. అది నిజం. అక్కకి చెప్పి వెళ్లిపోదాం అనుకున్నాం.  అక్క హాఫ్‌ బాటిల్‌ కంప్లీట్‌ చేసింది. ఫోన్‌ మాట్లాడి.. సోఫాలో పడుకుంది. రెండుసార్లు లేపాను.  సరే పడుకుందని డిస్టర్బ్‌ చేయొద్దని వెళ్లిపోయా. ఛాన్స్‌ దొరికిందని వెళ్లిపోయిన. నా తప్పేం లేదు సాయి. నాకు అక్కను చంపే ఉద్దేశం లేదు.. నన్ను నమ్ము సాయి.. నా తప్పేం లేదు.. ప్లీజ్‌రా నమ్మురా

మేం రెండు బాటిల్స్‌ తెప్పించుకున్నాం. నేను బ్రీజర్‌ తాగా. అక్క వోడ్కా తాగింది. తర్వాత నాకు ఏమైందో తెలీదు. నేనైతే వెళ్లిపోయిన ఇట్లా అయితదనుకోలేదు. నేనెందుకు చంపుత సాయి.. నేనేందుకు మర్డర్‌ చేస్తా!.’’ అంటూ వాయిస్‌ మెసేజ్‌లో ఉంది. 

దీప్తి ఒంటిపై గాయాలు
కోరుట్ల దీప్తి అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దీప్తి శరీరంపై గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ఎడమ చేయి కూడా విరిగిపోయి ఉండడంతో.. ఇదే హత్యేననే నిర్ధారణకు వచ్చారు పోలీసులు. కిచెన్‌లో వోడ్కా, బ్రీజర్‌ బాటిళ్లు, వెనిగర్‌, నిమ్మకాయలు ఉండటంతో రాత్రి వేళ దీప్తి, చందన కలిసి మద్యం సేవించారా..? అనే అనుమానాలు వ్యక్తం కాగా.. తాజా ఆడియోక్లిప్‌తో అవి నిర్ధారణ అయ్యాయి. చందన ప్రియుడితో కలిసి వెళ్లిపోయే ప్రయత్నాన్ని దీప్తి అడ్డుకునే క్రమంలో గొడవ జరిగి ఆ గొడవలో తగలరాని చోట దెబ్బతగిలి దీప్తి చనిపోయిందా..? అనే సందేహాలు బలపడుతున్నాయి. 

ఇదిలా ఉంటే.. మృతురాలు దీప్తి సోదరి చందన దొరికితేనే ఈ కేసు చిక్కుముడి వీడేది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా వాళ్‌లు నిజామాబాద్‌ వైపు వెళ్లే బస్సు ఎక్కినట్లు తెలుస్తోంది. దీంతో చందన ఆచూకీ కోసం రెండు బృందాలను రంగంలోకి దించారు పోలీసులు. మరోవైపు చందనతో ఉన్న యువకుడు ఎవరు? అనే దానిపైనా ఆరాలు తీస్తున్నారు.   

కేసు నేపథ్యం ఇదే..
ఆంధ్రకు చెందిన బంక శ్రీనివాస్‌రెడ్డి–మాధవి దంపతులు సుమారు పాతికేళ్లుగా కోరుట్లలోని భీమునిదుబ్బలో స్థిరపడ్డారు. ఇటుకబట్టీ వ్యాపారం చేసుకునే శ్రీనివాస్‌రెడ్డికి కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుమారుడు సాయి బెంగళూర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. పెద్ద కూతురు దీప్తి(24) పుణేలోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా వర్క్‌ఫ్రం హోం పద్ధతిన ఇంట్లో నుంచి పనిచేస్తోంది. చిన్నకూతురు చందన ఇటీవల బీటెక్‌ పూర్తి చేసింది. సోమవారం ఉదయం శ్రీనివాస్‌రెడ్డి– మాధవి హైదరాబాద్‌లోని బంధువుల గృహాప్రవేశం కార్యక్రమానికి వెళ్లగా దీప్తి, చందన మాత్రమే ఇంట్లో ఉన్నారు. రాత్రి 10 గంటల వరకు తండ్రితో అక్కాచెల్లెళ్లు ఫోన్‌లో మాట్లాడారు. 

మంగళవారం ఉదయం శ్రీనివాస్‌రెడ్డి తన కూతుళ్లతో మాట్లాడటానికి ప్రయత్నించగా పెద్ద కూతురు దీప్తి ఫోన్‌ లిఫ్ట్‌ కాలేదు. చిన్నకూతురు చందన ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. రెండుమూడు సార్లు ఫోన్‌లో కూతుళ్లతో మాట్లాడేందుకు ప్రయత్నించిన శ్రీనివాస్‌రెడ్డి చివరికి పక్క ఇంట్లో ఉన్నవారికి ఫోన్‌ చేశాడు. తమ కూతుళ్లు ఫోన్‌ ఎత్తడం లేదని చెప్పి, ఓ సారి ఇంటిదాకా వెళ్లి చూడమని కోరాడు. పక్క ఇంట్లో ఉండే ఓ మహిళ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లోకి వెళ్లి చూడగా తలుపు బయట నుంచి గొళ్లెం పెట్టి ఉంది. పిలిస్తే ఎవరూ పలకలేదు.

దీంతో తలుపు గొళ్లెం తీసి లోపలికి వెళ్లి చూడగా పెద్ద కూతురు దీప్తి సోఫాలో పడిపోయి ఉంది. చుట్టుపక్కల వారికి విషయం చెప్పగా వారు దీప్తిని పరిశీలించి అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. బంధువులు, పోలీసులకు సమాచారం ఇవ్వగా మెట్‌పల్లి డీఎస్పీ వంగ రవీందర్‌రెడ్డి, సీఐ లక్ష్మీనారాయణ, ఎస్సైలు కిరణ్‌, చిరంజీవి ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement