సాక్షి, న్యూఢిల్లీ: ఆదాయపన్ను చెల్లింపు కోసం ఇకపై రెండు విధానాలు అమల్లోకి ఉంటాయని, పాతవిధానంలో కొనసాగితే ఇప్పటివరకు ఉన్న మినహాయింపులు యథాతథంగా అమల్లో ఉంటాయని, కొత్త విధానంలోకి మారితే మినహాయింపులు ఏవీ ఉండవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టంచేశారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఆమె శనివారం మీడియాతో మాట్లాడారు.
ఆదాయపన్నుకు సంబంధించి పాత విధానమా? కొత్త విధానమా? అనేది పన్ను చెల్లింపుదారుడే నిర్ణయం తీసుకోవాలని ఆమె సూచించారు. కొత్త విధానంలో రూ. 5 లక్షల నుంచి 7 లక్షల ఆదాయానికి 10శాతం పన్ను, రూ. 7.5 లక్షల నుంచి రూ. 10 లక్షల ఆదాయానికి 15శాతం పన్ను, రూ. 10 లక్షల నుంచి రూ. 12.5 లక్షల ఆదాయానికి 20 శాతం పన్ను, రూ. 12.5 లక్షల నుంచి రూ. 15 లక్షల ఆదాయానికి 25శాతం పన్ను, రూ. 15 లక్షలకుపైగా ఆదాయానికి 30 శాతం పన్ను ఉంటుందని తెలిపారు.
పన్నురేట్లు తగ్గించేందుకే తాము ప్రయత్నం చేస్తున్నామని ఆమె వివరించారు. ఆదాయపన్ను విధానాన్ని సరళీకరించాలనే ఉద్దేశంతో ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చామని తెలిపారు. కొత్త విధానంలో 80సీ, 80డీ, ఎల్టీసీ, హెచ్చార్‌ఏ మినహాయింపులు ఉండవని తెలిపారు. ఇక, దీర్ఘకాలంలో ఆదాయపన్ను మినహాయింపులన్నీ తొలగిస్తామని, వాటి స్థానంలో తక్కువ పన్నురేటు ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్పొరేట్ పన్నుల విధానంలో మార్పులు తీసుకొచ్చినవిధంగానే ఆదాయపన్నుల్లోనూ మార్పులు తెస్తామని అన్నారు. ఆదాయపన్ను చెల్లింపు సరళీకృతంగా ఉండాలని కోరుకునేవారు కొత్త విధానంలోకి మారొచ్చునని, కొత్త విధానంలో ఆదాయపన్ను చెల్లింపు ఎంతో సులువుగా ఉంటుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment