బీఎస్పీకి బుఖారీ మద్దతు
పశ్చిమ యూపీలో ముగిసిన ప్రచార పర్వం
లక్నో: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)కి మద్దతు ఇస్తున్నట్లు ఢిల్లీ జామా మసీదు షాహీ ఇమాం మౌలానా అహ్మద్ బుఖారీ ప్రకటించారు. రాష్ట్రీయ ఉలేమా కౌన్సిల్ మద్దతు ఇచ్చిన మర్నాడే బుఖారీ మద్దతు ప్రకటించడంతో బీఎస్పీ శిబిరంలో ఉత్సాహం నెలకొంది. గురువారం బుఖారీ మాట్లాడుతూ.. ‘ముస్లింలు రాజకీయ ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారు. బీఎస్పీకి మద్దతు ఇవ్వనున్నారు. లేకుంటే ప్రతి రాజకీయ పార్టీ ముస్లింలను తమ ప్రయో జనాల కోసం ఫుట్‌బాల్‌లా వాడుతుంది. అఖిలేశ్ హయాంలో ముస్లింలు వివక్షకు గురయ్యారు. అఖిలేశ్ ముస్లింలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయాడని ములా యం చేసిన ప్రకటనే దీనికి నిదర్శనం’అని పేర్కొన్నారు.
పశ్చిమ యూపీలో త్రిముఖ పోటీ
పశ్చిమ యూపీలో తొలిదశ ఎన్నికల ప్రచారం గురువారంతో ముగిసింది. ఈ ప్రాంతంలోని 73 స్థానాల్లో ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. ఇక్కడ ఎస్పీ కాంగ్రెస్ కూటమి, బీఎస్పీ, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. ఇక్కడ ప్రధాని మోదీ విస్తృత ప్రచారం నిర్వహించారు. నోట్లరద్దుతో అవినీతిపై కొరడా ఝళిపించిన బీజేపీకి ఓటేయాలని కోరారు. ఏళ్ల తరబడి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఎస్పీ, బీఎస్పీలను ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు.