
సిగరెట్ కావాలంటే.. ప్యాకెట్ కొనాల్సిందే!
పొగాకు కంపెనీల షేర్లన్నీ ఒక్కసారిగా పడిపోయాయి. దీనికి కారణం.. మంగళవారం నాడు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన. సిగరెట్లను లూజుగా ఒకటి, రెండు చొప్పున అమ్మకూడదని, ఎవరైనా కావాలంటే మొత్తం ప్యాకెట్ కొనాల్సిందేనని కేంద్రం చెప్పింది. ఈ మేరకు ఓ నిపుణుల కమిటీ చేసిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులను కొనడానికి ఇన్నాళ్లూ ఉన్న గరిష్ఠ వయోపరిమితిని పెంచాలని కూడా నిపుణుల కమిటీ సూచించింది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం కింద కఠినమైన శిక్షలు వేయాలని తెలిపింది.
నిపుణుల కమిటీ సూచనలు, ప్రతిపాదనలను కేంద్ర మంత్రివర్గం ఆమోదించినట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. వీటికి పార్లమెంటు ఆమోదం తెలిపితే ఇక వెంటనే అమలవుతాయి. ప్రస్తుతం దాదాపు 70 శాతం సిగరెట్ అమ్మకాలన్నీ లూజు సేల్స్లోనే జరుగుతున్నాయి. ప్యాకెట్ కొనాలంటే దాదాపు రూ. 190 వరకు ఉండటంతో అంత భరించలేక.. తమకు కావల్సిన రెండు మూడు సిగరెట్లు కొంటారు. ఇప్పుడు కేంద్రం తన ఆలోచనను అమలుచేస్తే.. ఎంత లేదన్నా 10-20 శాతం వరకు సిగరెట్ల అమ్మకాలు పడిపోతాయని అంచనా. సిగరెట్ పరిశ్రమ నుంచి పన్నుల రూపేణా కేంద్రానికి ఏటా రూ. 25వేల కోట్లు వస్తుంది. కానీ ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని వదులుకోడానికీ ప్రభుత్వం సిద్ధపడుతోంది. 2012 సంవత్సరంలో భారతీయులు 10 వేల కోట్ల సిగరెట్లు తగలబెట్టారు.