* మరో 20-30 మందికి చాన్స్
* అమిత్ షాకు రక్షణ శాఖ!
న్యూఢిల్లీ: ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను సంతృప్తి పర్చేందుకు, పార్టీలోని అసంతృప్తులను చల్లబర్చేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన కేబినెట్‌ను మరింత విస్తరణకు కసరత్తు చేస్తున్నారు. ఈ విస్తరణలో 20 నుంచి 30 మంది వరకూ అవకాశం కల్పించవచ్చని తెలుస్తోంది. దీనిలో ఎక్కువ మందికి సహాయ మంత్రులుగానే అవకాశం దక్కవచ్చు. అయితే ఈ విస్తరణ జూన్ 15 తర్వాత చేపట్టవచ్చని సమాచారం. ప్రస్తుతం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వద్ద నున్న రక్షణ శాఖకు పూర్తిస్థాయి మంత్రిని మోడీ నియమించే అవకాశం ఉంది. మోడీ అనుచరుడు అమిత్‌షాకు కేబినెట్‌లో చోటు కల్పించి రక్షణ శాఖ అప్పగిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మోడీ ఖాళీ చేసిన వడోదర లోక్‌సభ స్థానం నుంచి అమిత్‌షాను బరిలోకి దింపి ఆ శాఖ కట్టబెడతారని సమాచారం. ఇక మహారాష్ట్రలో 18 సీట్లు గెలిచి ఎన్డీఏలో రెండో పెద్ద పార్టీగా అవతరించిన శివసేన పార్టీ.. తొలి కోటాలో తనకు దక్కిన ఒకే ఒక్క బెర్త్‌పై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆ పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ప్రధానితో చర్చలు జరిపారు. దీంతో ఇపుడు రెండో కోటాలో ఆ పార్టీ మరిన్ని పదవులు పొందే అవకాశం ఉంది. ఆ పార్టీతో పాటు తెలుగుదేశం పార్టీకి కూడా మంత్రి వర్గంలో మరిన్ని బెర్త్‌లు దక్కే చాన్సుంది.
రాజస్థాన్‌లోని అన్నిస్థానాలూ బీజేపీ చేజిక్కించుకున్నా ఆ రాష్ట్రానికి కేబినెట్‌లో ఒకే ఒక్క బెర్త్ దక్కింది. దీనిపై ఆ రాష్ట్ర వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. తమ రాష్ట్రానికి కనీసం మూడు కేబినెట్ బెర్త్‌లు దక్కుతాయని ఆశిస్తున్నాయి. లోక్‌సభ సమావేశాలు జూన్ 4న ప్రారంభమై 12న పూర్తవుతాయి. ఆ తర్వాతే విస్తరణ ఉండవచ్చు.
15 తర్వాత కేబినెట్ విస్తరణ!
Published Fri, May 30 2014 12:53 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement