న్యూఢిల్లీ: భూసేకరణ సవరణ చట్టానికి సంబంధించి రెండోసారి ఆర్డినెన్స్ తీసుకురావాలని కేంద్ర కేబినెట్ మంగళవారం నిర్ణయించింది. పార్లమెంట్ బడ్జెట్ తొలి దశ సమావేశాల్లో భూసేకరణ బిల్లుకు ఆమోదం తెలిపిన సందర్భంలో ప్రతిపాదించిన 9సవరణలను చేరుస్తూ కొత్త ఆర్డినెన్స్‌ను తీసుకురానున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. విపక్షాల తీవ్ర వ్యతిరేకతతో రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందే అవకాశం లేకపోవటంతో పెద్దలసభను ప్రొరోగ్ చేసి మరీ రెండోసారి ఆర్డినెన్స్‌ను తీసుకువస్తున్నారు.
మరోవైపు హోమియోపతి విద్య మరింత గుణాత్మకంగా మెరుగుపడేందుకు హోమియోపతి చట్టంలో సవరణలు తీసుకురావాలన్న ప్రతిపాదనకూ కేబినెట్ ఆమోదం తెలిపింది. మారిషస్‌తో సంప్రదాయ వైద్య విధానాల సహకారంపై ఒప్పందం చేసుకునేందుకూ కేబినెట్ క్లియరెన్స్ ఇచ్చింది.