
రోబోలను నమ్మలేం!
న్యూఢిల్లీ: రోబోలు తీసుకునే నిర్ణయాలపై విశ్వాసం ఉంచలేమని భారత్ సహా పలు దేశాల్లోని యువతరం చెబుతోంది. స్విట్జర్లాండ్‌లోని జెనీవా కేంద్రంగా పనిచేసే ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) చేసిన తాజా సర్వేలో పలు విషయాలు వెల్లడయ్యాయి. 180 దేశాల్లో 18–35 ఏళ్ల మధ్య వయసున్న 31 వేల మందితో డబ్ల్యూఈఎఫ్ ‘గ్లోబల్ షేపర్స్ యాన్యువల్ సర్వే–2017’ను నిర్వహించింది. సాంకేతికత, ఆర్థిక వ్యవస్థ, విలువలు, ఉద్యోగాలు, పరిపాలన తదితర అంశాలకు సంబంధించి యువతరం అభిప్రాయాలను నమోదు చేసింది.
‘అవినీతి, అసమానతలు, ఉద్యోగ, ఆర్థిక వృద్ధికి అవకాశాల కొరత, వాతావరణ మార్పులు అన్నింటికన్నా ప్రధాన సమస్యలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యువతరం భావిస్తోంది’ అని సర్వే నివేదిక పేర్కొంది.‘సామర్థ్యాల పెంపునకు తోడ్పడేలా మీ శరీరంలో ఏదైనా పరికరాన్ని అమర్చడానికి ఒప్పుకుంటారా?’ అని ప్రశ్నించగా 44 శాతం మంది నిరాకరించారు. మనుషుల్లా ఉండే, ప్రవర్తించే రోబోలకు కొన్ని హక్కులు కల్పించడానికి ఒప్పుకుంటారా అంటే 50 శాతం మంది ఒప్పుకోమని చెప్పగా 14 శాతం మంది మాత్రమే సరేనన్నారు. 36 శాతం మంది ఎటూ తేల్చలేకపోయారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది కలల దేశంగా అమెరికా మొదటి స్థానంలో ఉంది.