
దారుణంగా తలపై గాజు సీసాలతో కొట్టి..
హౌరా: ఒక వ్యక్తి మరో వ్యక్తి విషయంలో ఎంతటి ఏహ్య భావంతో ఉంటాడో చెప్పేందుకు ఇదొక ఉదాహరణ. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తి తాను నడుపుతున్న బైక్ ను ఓ యువకుడికి కొంచెం తగిలించాడని కారణంతో అతడిని దారుణంగా దాడి చేశారు. అతడిని చావు దెబ్బలు కొట్టారు. అప్పటికే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న అతడు ఇటీవల కీమో థెరపీ తీసుకున్నాడు.
ఆదివారం రాత్రి తన పని ముగించుకొని ఇంటికి తిరిగొస్తుండగా అతడిపై ఏమాత్రం దయచూపకుండా చితక్కొట్టారు. దాంతో అతడు తీవ్ర గాయాలపాలయ్యాడు. అతడి తలలో నాలుగు చోట్ల రక్తం గడ్డకట్టుకుపోయింది. సీసీటీవీ కెమెరాలో రికార్డయిన వీడియో, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం షేక్ మిరాజ్(35) అనే వ్యక్తి హౌరాలోని బేలూరు ప్రాంతంలో ఉంటున్నాడు. అతడికి క్యాన్సర్ ఉంది.
ఈ మధ్యే కీమో థెరపీకి వెళ్లొచ్చాడు. అయితే, క్యాన్సర్ వ్యాధితో ఉన్న అతడి వల్ల చుట్టుపక్కలవారికి అదే జబ్బు వస్తుందని, ఆ ప్రాంతం విడిచిపెట్టి పోవాలని కొందరు అతడిని బెదిరస్తూ వస్తున్నారు. మిరాజ్ కు చిన్న వ్యాపారం ఉంది. ఆదివారం రాత్రి తన పనులు ముగించుకొని వస్తుండగా తాను ఉండే ప్రాంతానికి చెందిన యువకుల్లో ఓ యువకుడి కాలుకి తను బైక్ పార్కింగ్ చేస్తుండగా కొంచెం తగిలింది.
దీంతో అదే అదనుగా తీసుకొని అక్కడ ఉన్నవారంతా అతడిని దారుణంగా కొట్టారు. సాఫ్ట్ డ్రింక్ బాటిల్స్ మిరాజ్ తలపై పగులగొట్టారు. బైక్ తగలడం తప్పే అని ఒప్పుకున్నా విడిచిపెట్టకుండా కొట్టి కాలనీ ఖాళీ చేసి వెళ్లాలని బెదిరించారు. ప్రస్తుతం మిరాజ్ ను ఆస్పత్రిలో చేర్పించారు. దాడికి దిగిన యువకులను 15 ఏళ్లు జైల్లో వేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.