
ట్రిపుల్ రైడింగ్‌ను అడ్డుకున్నందుకు చితకబాదారు!
వడోదర: గుజరాత్‌లోని వడోదరలో దాదాపు గంటపాటు ఓ ట్రాఫిక్ పోలీసును కోపోద్రిక్త మూక చితకబాదింది. దాదాపు 40 మంది మూగి అతనిపై దాడి చేశారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ మోటార్ బైక్‌ను తగులబెట్టారు. ముగ్గురు పోలీసులు వచ్చి ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను మూక నుంచి రక్షించే ప్రయత్నం చేసినా ఫలించలేదు. పోలీసులు అతన్ని తమ జీపులో ఎక్కించుకున్నా.. అతన్ని బయటకు లాగి చితకబాదారు. మంగళవారం జరిగిన ఈ ఘటనలో ట్రాఫిక్ కానిస్టేబుల్ శాంతిలాల్ పర్మార్‌కు తీవ్రగాయాలయ్యాయి. అతికష్టం మీద పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించారు.
మంగళవారం మధ్యాహ్నం కానిస్టేబుల్ శాంతిలాల్ ఒకే బైక్ మీద వెళుతున్న ముగ్గురిని ఆపే ప్రయత్నం చేశాడు. దీంతో వారు డివైడర్‌కు ఢీకొని కింద పడ్డారని, బైక్ నడుపుతున్న యువకుడికి ముఖంపై గాయాలయ్యాయని పోలీసులు చెబుతుండగా.. కానిస్టేబుల్ లాఠీని విసిరికొట్టడం వల్లే బైక్ మీద నుంచి యువకుల కిందపడ్డారంటూ దాదాపు 40 వ్యక్తులు గుమిగూడి వడోదరలో దాదాపు గంటపాటు విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనను ఓ టీవీ రిపోర్టర్ రికార్డు చేయడంతో ఈ వీడియో ఆధారంగా దాడి చేసిన వ్యక్తులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.