
సీతను వేధించారంటూ రాముడిపై కేసు
పాట్నా: మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే దేవుడైనా సరే భారత న్యాయస్థానం ముందు నిలబడాల్సిందే. విచారణ ఎదుర్కోవాల్సిందే. ఇతిహాసమైన రామాయణంలో రాముడు సీత పట్ల అనుచితంగా అన్యాయంగా వ్యవహరించారని ఆరోపిస్తూ బీహార్‌లోని సీతమరాహి చీఫ్ జుడీషియన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఠాకూర్ చందన్ కుమార్ సింగ్ అనే న్యాయవాది సాక్షాత్తు రాముడిపైనే కేసు దాఖలు చేశారు.
ఏ పాపం తెలియని సీతను అన్యాయంగా అగ్ని పరీక్షకు గురిచేసి అవమానించారని, అమానుషంగా ఆమెను 14 ఏళ్లు వనవాసం పంపించారని న్యాయవాది రాముడిపై కేసులో ఆరోపణలు చేశారు. ఎవరైనా తన భార్య పట్ల ఇంత క్రూరంగా వ్యవహరిస్తారా? ఇది రాముడి ఆత్మవంచన కాదా? అంటూ కూడా ఆయన తన కేసులో ప్రశ్నించారు. పురాణకాలం నాటి రాముడిపైన ఇప్పుడు కేసు వేయడం ఏ విశేషమైతే, ఆ కేసును విచారణకు చీఫ్ జుడిషియల్ మేజిస్ట్రేట్ స్వీకరించడం అంతకన్నా విశేషం.
ఈ కేసుపై ట్విట్టర్ యూజర్లు తమదైన శైలిలో స్పందించారు. ‘రాముడిపై కేసు విచారణను వాయిదా వేయాలి. ఎందుకంటే ఆయనకు సరైన చిరునామా లేదు....రాముడిపై కేసు వేశారు సరే. ఆయన కేసు విచారణకు హాజరైతే వింతే....రాముడిపై 2000 సంవత్సరాల క్రితమే కేసు వేసి ఉంటారు. ఆయనపై ఈరోజు భూమిపైన విచారణ జరగుతోంది.....త్రేతాయుగం నాటి కేసులను కూడా పరిష్కరించేందుకు కోర్టు సిద్ధమైంది.
రాముడు తన భూమి, సంపదను తిరిగి ఇచ్చివేయాలంటూ వేసే కేసును కూడా విచారణకు స్వీకరిస్తారని ఆశ కలగింది....ఈ కేసు విచారణ నేపథ్యంలో కురుక్షేత్ర యుద్ధానికి సంబంధించిన ఫైళ్లన్నింటినీ వెల్లడించాలని మనం మోదీపై ఒత్తిడి తీసుకరావాలి....నిందితుడైన రాముడిని జడ్జీ మొట్టమొదటిసారిగా ‘మై లార్డ్’ అని సంబోధిస్తారు కాబోలు....మీకు 14 ఏళ్ల జైలుశిక్ష విధంచవచ్చేమో....బీహార్ కోర్టుల్లో లక్షలాది కేసులు పెండింగ్‌లో ఉండగా రాముడిపై కేసును విచారించడమెందుకో....సీతను వేధించారని రాముడిపై కేసు పెట్టారు. వీసా లేకుండా లంకకు వెల్లారంటూ హనుమంతుడిపై కేసుపెడతారా?....’ ఇలా ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి.