కులం కార్డు పనిచేసిందా?
కులమే ఉత్తరప్రదేశ్ రాజకీయాలను శాసిస్తుందనే రాజకీయ పండితులు, మీడియా సూత్రీకరణ 2017 అసెంబ్లీ ఎన్నికలకు వర్తిస్తుందా? అసలు కులమనే అంశం యూపీ 17వ శాసనసభ ఎన్నికల్లో అసలు పనేచేయలేదా? అన్న ప్రశ్నలకు సమాధానం ఒక్క మాటలో చెప్పడం కష్టం. మతాన్ని బహిరంగంగా, మిగతా పార్టీల్లాగానే కులాన్ని తెలివిగా ఎన్నికల్లో వాడుకునే తెలివితేటలున్న బీజేపీ అనూహ్యంగా 315కు పైగా సీట్లు సాధించాక, ‘యూపీ ఎన్నికల్లో కులం ప్రభావం లేదు. కులాలకు అతీతమైన ఘన విజయం మాది’’అంటూ కాషాయపక్షం నేతలు ప్రకటనలు గుప్పిస్తున్నారు. గెలిస్తే కులం కారణం కాదనీ, ఓడితే కులతత్వం పనిచేసిందని ’జాతీయ జీవన స్రవంతి’(మెయిన్‌స్ట్రీమ్) పార్టీలు చెప్పడం సాధారణం. ఈ నేపథ్యంలో బీసీ, ఎస్సీల స్వరం పెరిగినప్పటి నుంచీ ప్రతి ఎన్నికల్లో ఫలితాలను ప్రభావితం చేసే రెండు మూడు ప్రధానాంశాల్లో కులం ఒకటిగా ఉందనే వాస్తవాన్ని ఎప్పుడో గుర్తించారు.
దాదాపు 19 శాతమున్న ముస్లింలకు ఒక్క టికెట్ ఇవ్వకున్నా మెజారిటీ సాధించాక మతం ప్రభావం లేదని బీజేపీ చెప్పడం ఎంత హేతుబద్ధమో ఇప్పుడు యూపీని 15 ఏళ్ల అనంతరం కాషాయ ఖాతాలో వేసుకున్నాక అందులో కులం పాత్ర లేదనడం అంతే హేతుబద్ధం. బీజేపీ ప్రమేయం లేకుండా 2003 ఆగస్టు ఆఖరు నుంచి ఇప్పటి వరకూ పదమూడున్నరేళ్లు ఉత్తరప్రదేశ్‌కే ప్రధానంగా పరిమితమై పాలించిన ఎస్పీ, బీఎస్పీలు కింది, మధ్యస్థాయి హిందూ కులాల ఆధిపత్యంలోని పార్టీలనేది జగమెరిగిన సత్యం. ఇంకా సూటిగా చెప్పాలంటే, వెనుకబడిన వర్గాల్లోని(బీసీ) ప్రధాన కులమైన యాదవులు సమాజ్‌వాదీపార్టీకి పునాదివర్గమైతే, ఎస్సీ(దళితులు)ల్లో బలమైన చర్మకార వృత్తిలో ఉన్న జాటవ్‌ల ఆలంబనతో బహుజన్ సమాజ్ పార్టీ నడుస్తోంది.
బీఎస్పీ స్థాపక అధ్యక్షుడు కాన్షీరాం, ప్రస్తుత నాయకురాలు, మాజీ సీఎం మాయావతి–ఇద్దరూ జాటవ్ కుటుంబాల్లో పుట్టారు. ఎస్పీ నేత ములాయంసింగ్ యాదవ్ ఏ వర్గంలో పుట్టినదీ ఆయన పేరే చెబుతోంది. 2007లో బీఎస్పీ తన పునాదివర్గం జాటవ్‌లు, ఇతర ఎస్సీ కులాలు, యాదవేతరులైన బాగా వెనుకబడిన బీసీ కులాలవారు, అదనంగా బ్రాహ్మణుల మద్దతుతో తొలిసారి మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చింది. ముస్లింల మద్దతు కూడా ఎస్పీకి లభించినంత కాకపోయినా ఓ మోస్తరుగా లభించింది. 2012లో యాదవులు, కుర్మీలు, మరి కొన్ని బీసీ కులాలు, జాటవేతర ఎస్సీలు, అత్యధిక ముస్లింల మద్దతుతో ఎస్పీ అధికారంలోకి వచ్చింది.
2017 ఎన్నికల్లో కులం పాత్ర ఎంత?
అవినీతి, నల్లధనంపై పోరాటం, ఉపాధి కల్పన వంటి నినాదాలు పేద, మధ్యతరగతి వర్గాలతోపాటు అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాల కారణంగా యూపీలో బీజేపీ, దాని మిత్ర పక్షం కలిసి 73 సీట్లు సాధించాయి. దీనికి తోడు ఎన్డీఏ తన ఎన్నికల ప్రచారంలో అభివృద్ధికి ప్రతిరూపంగా చూపించిన ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీని ఢిల్లీ పీఠంపై కూర్చోబెట్టాలనే నినాదం వల్ల కూడా కులమతాలకు అతీతంగా రాష్ట్రంలో పోలైన ఓట్లలో 42.63 శాతం బీజేపీకి పడ్డాయి. పార్లమెంటు ఎన్నికలు జరిగి దాదాపు మూడేళ్లు గడిచాక లక్నో గద్దెపై ఎవరుండాలనే విషయమై జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కులం ప్రభావం తప్పక ఉంటుందనే ఎరుకతో బీజేపీ పైకి చెప్పకపోయినా ఆచరణలో గొప్ప కుల సూత్రాన్ని కిందటేడాది ఏప్రిల్ 8న అమలు చేయడం ప్రారంభించింది. ప్రధాన యాదవేతర ఎంబీసీ వర్గమైన కుశ్వాహా కుటుంబంలో పుట్టిన ఫూల్పూర్ ఎంపీ కేశవ్ ప్రసాద్ మౌర్యాను యూపీ బీజేపీ అధ్యక్షునిగా నియమించడం నుంచి అసెంబ్లీ టికెట్ల కేటాయింపు వరకూ దీన్ని పాటించారు. మౌర్యాకు ముందు బ్రాహ్మణ వర్గానికి చెందిన లక్ష్మీకాంత్ బాజ్‌పేయి ఈ పదవిలో ఉన్నారు. అదీగాక 1991 నుంచి 2002 మధ్యకాలంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన సందర్భాల్లో కల్యాణ్‌సింగ్(ఓబీసీ)కు రెండుసార్లు, రాంప్రకాశ్‌గుప్తా(వైశ్య), రాజ్‌నాథ్‌సింగ్‌లకు ఒక్కోసారి సీఎంలుగా అవకాశమిచ్చింది.
బీసీ ప్రధాని అంటూ బీజేపీ ప్రచారం
కిందటి పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూతురు ప్రియాంకా వాద్రా ‘మొదీవి నీచ రాజకీయాలు’ అని చేసిన వ్యాఖ్యకు జవాబుగా,‘‘వెనుకబడిన కులంలో పుట్టడం తప్పా? నేనేమైనా ఏ కులాన్నయినా ద్వేషించానా? ఇలాంటి మాటలు నన్ను దిగ్భ్రాంతిపరిచాయి’’అంటూ మోదీ గట్టిగా, తెలివిగా జవాబిచ్చారు. ఇలా అవకాశం వచ్చిన ప్రతిసారీ కులాన్ని బీజేపీ, మోదీ ఆయుధంగా వాడుకున్నాయి.
యాదవేతర ఓబీసీలు, జాటవేతర ఎస్సీలకే అత్యధిక టికెట్లు
ఈ ఎన్నికల్లో మొత్తం 403 సీట్లకుగాను జనరల్ సీట్లలో 140 అసెంబ్లీ టికెట్లు యాదవేతర ఓబీసీ కులాలవారికి, మొత్తం 84 ఎస్సీ రిజర్వ్‌సీట్లలో 70 మంది జాటవేతర కులాల అభ్యర్ధులకు బీజేపీ కేటాయింది. మొత్తం జనాభాలో ఎస్సీలు 21 శాతం ఉంటే, ఇందులో 12 శాతం జాటవ్‌లే(వీరినే చమార్లని కూడాఅంటారు). బీఎస్పీలలో వీరికెలాగూ ప్రాధాన్యం ఉన్నందువల్ల మిగిలిన 9 శాతం ఎస్సీలను(వీరిలో బలమైన వర్గం నాలుగుశాతమున్న పాసీలు) ఆకట్టుకోవడానికి బీజేపీ ఇలా ప్రాధాన్యమిచ్చింది. కుర్మీల పార్టీ అప్నాదళ్(సోనేలాల్), బాగా వెనుకబడిన రాజ్‌భర్ల పార్టీ సుహేల్‌దేవ్ భారతీయ్ సమాజ్ పార్టీ అనే బుల్లి పార్టీలతో 20 లోపు స్థానాల్లో పొత్తు పెట్టుకుంది.
అలాగే, బీసీల మొత్తం జనాభా వాటా 42–45 శాతం ఉంటే, అందులో ఎస్పీకి కీలకమైన యాదవుల వాటా 8–10 శాతం వరకూ ఉంది. ముస్లింలకు ఒక్క టికెట్ ఇవ్వకున్నా నష్టం లేదని అనుభవంలో గ్రహించిన బీజేపీ అదే సూత్రాన్ని జాటవ్‌లు, యాదవ్‌ల విషయంలో అనుసరించి 2014 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో మంచి ఫలితాలు సాధించింది. గెలిచిన 71 మంది ఎంపీల్లో ఒక్కరూ యాదవ్ కాదు. ఇదే పద్ధతి పాటించి రికార్డు స్థాయిలో ఇప్పుడు 325 సీట్లు కైవసం చేసుకుంది.
‘బ్రాహ్మణ–బనియా’ పార్టీ రూపాంతరం
మొదట జనసంఘ్‌గా ఉనికిలో ఉన్న ఈ కాషాయపక్షానికి బ్రాహ్మణ–బనియా(వైశ్యులే బనియాలు)పార్టీగా పిలిచేవారు. 1980లో బీజేపీ రూపంలో కొత్త అవతారమెత్తినప్పటి నుంచీ ఆ పేరును నెమ్మదిగా తుడిచేసే ప్రయత్నం చేస్తోంది. ఆర్యవర్తంలో కీలకమైన యూపీ, బిహార్‌లో అగ్రవర్ణాధిపత్యం పోతున్న దశలో చేతికందిన రామజన్మభూమి ఉద్యమం ఉత్తరాదిన సాంస్కృతీకరణ పొందిన బీసీలు, దళితులు పెద్ద సంఖ్యలో బీజేపీకి, సంఘ్ పరివార్‌కు దగ్గరయ్యేలా చేసింది. ఎన్నికల రాజకీయాలు ఈ వర్గాల ప్రాతినిధ్యాన్ని పరివార్‌లో బాగా పెంచాయి. ఈ క్రమంలోనే సమర్ధుడుగా పేరుతెచ్చుకున్న ఓబీసీ నరేంద్రమోదీ బీజేపీకి పదునైన అస్త్రమయ్యారు. గాంచీ(తేలీ) కుటుంబంలో పుట్టిన మోదీని హిందీ ప్రాంతంలోని ఇతర బీసీలు, నేతలు చాలా వరకు ఆ కారణంగా మొదట్లో అభిమానించారు. కిందటి పార్లమెంటు ఎన్నికల్లో ఆయన కులంపై కాంగ్రెస్ చేసిన అనవసర రాద్ధాంతం కూడా ఆయన బీసీ అనే విషయాన్ని దేశ ప్రజలందరికీ తెలిసేలా చేసింది.
- సాక్షి నాలెడ్జ్ సెంటర్