సీబీఐ చేతికి ముండే మృతి కేసు
దివంగత కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు గోపీనాథ్ ముండే మరణానికి కారణం నిజంగా ప్రమాదమేనా? ఈ విషయాన్ని తేల్చడానికి సీబీఐ విచారణ త్వరలోనే మొదలుకానుంది. ఇప్పటికే ఆ కేసు విచారణను సీబీఐ తన చేతుల్లోకి తీసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో జూన్ 3వ తేదీన సిగ్నల్ జంప్ చేసి వచ్చిన కారు ముండే కారును ఢీకొనడంతో ఆయన తలుపు లోంచి బయట రోడ్డుమీద పడిపోయారని, మెడకు, కాలేయానికి గాయాలు కావడం, దానివల్ల షాక్, హెమరేజి సంభవించడంతో గోపీనాథ్ ముండే మరణించారని ప్రాథమికంగా నిర్ధారించారు.
అయితే.. ఆ తర్వాత బీజేపీ నాయకులలో కొందరు పలు రకాల అనుమానాలు వ్యక్తం చేశారు. ఒకానొక సమయంలో పార్టీలో తీవ్ర అవమానాలు ఎదురు కావడంతో ముండే బీజేపీ నుంచి బయటకు వెళ్లిపోవాలని భావించినట్లు మహారాష్ట్రకు చెందిన పార్టీ నాయకుడు పాండురంగ్ ఫండ్కర్ ఆరోపించారు. ఆ తర్వాత మరికొందరు నాయకులు కూడా అనుమానాలు వ్యక్తం చేయడంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సీబీఐ విచారణకు సిఫార్సు చేసింది. ఆ విచారణ త్వరలోనే మొదలవుతోంది.