సీబీఎస్‌ఈ టాపర్ ఈ అమ్మాయే
న్యూఢిల్లీ: సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలను ఆదివారం కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ విడుదల చేశారు. ఈ ఫలితాల్లో అమిటీ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థిని రక్ష గోపాల్ 99.6 శాతంతో ప్రథమ స్ధానంలో నిలిచింది. డీఏవీ స్కూల్‌కు చెందిన భూమి సావంత్ డే 99.4 శాతం మార్కులతో రెండో స్ధానంలో నిలవగా, భవన్ విద్యాలయ పాఠశాలకు చెందిన ఆదిత్య జైన్ 99.2 శాతం మార్కులతో మూడో స్ధానం సంపాదించాడు.
కాగా, గతేడాది కంటే ఉత్తీర్ణత ఒక శాతం తగ్గింది. 2016లో 83 శాతం మంది విద్యార్థులు పరీక్షలో పాసవ్వగా.. ఈ ఏడాది 82 శాతం మంది విజయవంతంగా 12వ తరగతిని పూర్తి చేశారు. ఫలితాల విడుదల అనంతరం ప్రకాశ్ జవదేకర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. విజయం సాధించని విద్యార్థులు కుంగిపోకుండా మరింత కష్టపడాలని చెప్పారు.
సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాల్లో టాప్ రావడంపై మాట్లాడుతూ.. తాను టాపర్‌గా నిలిచానంటే ఇప్పటికీ నమ్మశక్యంగా లేదని రక్ష గోపాల్ పేర్కొంది. పరీక్షలు రాసేప్పుడు బాగా రాయాలని భావించనని, టాపర్ కావాలని అనుకోలేదని తెలిపింది.