‘ముందస్తు’కు సిద్ధంగా ఉన్నాం | CEC Is Ready For Conduct Elections In Telangana | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 11 2018 3:13 AM | Last Updated on Tue, Sep 11 2018 3:13 AM

CEC Is Ready For Conduct Elections In Telangana - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ శాసనసభ ఎన్నికల నిర్వహణకు పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉన్నామని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ)కు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) రజత్‌కుమార్‌ నివేదించారు. జనవరి 1, 2018 నాటికి అర్హులయ్యే ఓటర్ల తుది జాబితాను మార్చి 24న ప్రచురించామని.. దాని ప్రకారం 2,53,27,785 మంది ఓటర్లు ఉన్నారని, వారికి నూరు శాతం ఫోటో గుర్తింపు కార్డులు జారీ చేశామని చెప్పారు. ఈ తేదీ నాటికి అర్హులైన వారు ఓటరుగా నమోదు చేసుకునేందుకు వీలుగా జారీ చేసిన తాజా ఓటరు నమోదు షెడ్యూలు ప్రకారం అక్టోబర్‌ 8న ఓటర్ల తుది జాబితా ప్రచురించాల్సి ఉందని, ఇందులో స్వల్పంగా ఓటర్లు పెరిగే అవకాశం ఉందని వివరించారు.

4 రాష్ట్రాలతో పాటు తెలంగాణలో ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా సంసిద్ధతను తెలుసుకునేందుకు రజత్‌కుమార్‌ను సీఈసీ ఢిల్లీ ఆహ్వానించింది. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు వివిధ స్థాయిల్లో ఎన్నికల నిర్వహణకు సంసిద్ధతను సీఈసీకి రజత్‌కుమార్‌ నివేదించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సీఈసీ ప్రధాన కమిషనర్‌ ఓపీ రావత్, మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సునిల్‌ ఆరోరా, అశోక్‌ లావాసాతో జరిగిన సమావేశంలో రజత్‌కుమార్‌ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఎన్నికల నిర్వహణకు జిల్లాల వారీగా ప్రణాళిక, ఎన్నికల యంత్రాంగం, శిక్షణ, గౌరవ వేతనాలు–వేతనాలు, భవనాలు–వాహనాల అవసరం, ఎన్నికల సామగ్రి తదితర 6 అంశాలపై సీఈసీ లోతుగా ఆరా తీసింది.  

బెంగళూరు నుంచి ఈవీఎంలు
జిల్లాల స్వరూపం, స్థితిగతులు, అందుబాటులో ఉన్న వనరులు, శాంతిభద్రతలు, రవాణాకు అనుకూలంగా లేని ప్రాంతాలు, పోలింగ్‌ స్టేష న్లు, అక్కడ అందుబాటులో ఉన్న కనీస వసతు లు, సున్నితమైన, అతిసున్నితమైన, సమస్యాత్మక పోలింగ్‌ స్టేషన్లు, అవసరమైన మావన వన రులు, వారికి శిక్షణ, అవసరమైన సాయుధ బలగాలు–శిక్షణ, సిబ్బందికి సమకూర్చాల్సిన వాహ నాలు, వసతి, వేతనాలు, అన్ని మార్గాలకు రూట్‌ మ్యాప్‌ల రూపకల్పన తదితర అంశాలపై వివరాలను సీఈసీకి రజత్‌కుమార్‌ అందజేశారు. అలాగే అవసరమైన ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రా లు, వీవీప్యాట్‌ల వివరాలిచ్చారు. సీఈసీ ఇప్పటికే ఇచ్చిన ఆదేశం మేరకు ఆయా యంత్రాలు బెంగళూరు నుంచి తెలంగాణకు రానున్నాయి. ఈవీఎంల నిర్వహణ ప్రణాళిక, కమ్యూనికేషన్‌ ప్రణాళికనూ సీఈవో వివరించారు. ఈ నివేదిక లు, ఎన్నికల నిర్వహణకు సంసిద్ధతపై మంగళ వారం హైదరాబాద్‌ సందర్శించే సీఈసీ ప్రతినిధి బృందం ధ్రువీకరించుకోనుంది.  

నవంబర్‌ చివర్లో ఎన్నికలు?
హైదరాబాద్‌లో పర్యటించే కేంద్ర ఎన్నికల బృందం.. ఎన్నికల నిర్వహణ సంసిద్ధతపై సంతృప్తి చెందితే ఎన్నికల షెడ్యూలుపై సీఈసీ ఓ నిర్ణయానికి రానుంది. షెడ్యూలుపై రాష్ట్ర సీఈవోతో సీఈసీ చర్చించినట్లు సమాచారం. తాజాగా జారీ చేసిన ఓటరు నమోదు అభ్యంతరాలపై పరిష్కారాలకు చివరి తేదీ అక్టోబర్‌ 4గా నిర్ణయించారు. తుది జాబితాను అక్టోబర్‌ 8న ప్రచురించనున్నారు. కాబట్టి అక్టోబర్‌ 8 తరువాత ఎప్పుడైనా షెడ్యూలు జారీ చేసే అంశంపై చర్చించినట్లు సమాచారం. ఆ షెడ్యూలును అనుసరించి నవంబర్‌ చివర్లో ఎన్నికల నిర్వహణకు అనుకూల తేదీలపై చర్చించినట్లు తెలుస్తోంది.

ఎన్నికల సంసిద్ధతపైనే చర్చ
సీఈసీతో సమావేశం పూర్తయిన తర్వాత రజత్‌కుమార్‌ మీడియాతో మాట్లాడారు. ‘మంగళవారం కమిషన్‌ నుంచి ప్రతినిధి బృందం హైదరాబాద్‌ వస్తోంది. భేటీలో ఎన్నికల నిర్వహణకు సంసిద్ధతపై చర్చించాం. సంసిద్ధత అనేది క్రమపద్ధతిలో నడుస్తుంది. స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌ ప్రారంభమైంది’అని వివరించారు. ఓటరు జాబితాల అవకతవకలపై ప్రశ్నించగా.. ‘జాబితా సరి చేయాల్సి ఉంది’అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement