తీవ్రంగా కలతచెందిన సీఈఓ | Disappointed on ceo rajath kumar | Sakshi
Sakshi News home page

తీవ్రంగా కలతచెందిన సీఈఓ

Published Thu, Dec 6 2018 5:18 AM | Last Updated on Thu, Dec 6 2018 10:05 AM

Disappointed on ceo rajath kumar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రేవంత్‌రెడ్డి అరెస్టు ఘటనను హైకోర్టుతోపాటు కేంద్ర ఎన్నికల సంఘం సైతం తీవ్రంగా తప్పుబట్టడంతో సీఈఓ రజత్‌కుమార్‌ కలత చెందారు. సజావుగా సాగుతున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికలు మరో వారంలో ముగుస్తాయన్న తరుణంలో ఈ ఘటనతో ఆయన తీవ్ర ఆగ్రహానికి లోనైయ్యారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. రెండ్రోజులుగా సీఈఓను కలిసేందుకు ఆయన కార్యాలయ వర్గాలు సైతం భయపడుతున్నట్లు సమాచారం. రాష్ట్ర శాసనసభ రద్దయినప్పటి నుంచి రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నిర్వహణకు గత నాలుగు నెలలుగా పడిన కష్టం ఈ ఒక్క ఘటనతో విలువ లేకుండా పోయిందని సీఈఓ ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. రేవంత్‌ అరెస్టుపై దాఖలైన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ విచారణ సందర్భంగా.. ఎన్నికల సంఘం పనితీరుపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఆయన కలత చెందారు.

‘అవసరమైన చర్యలకే’ ఆదేశం
 ఈ నెల 4న కొడంగల్‌లో సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ నిర్వహించడాన్ని వ్యతిరేకి స్తూ రేవంత్‌రెడ్డి బంద్‌కు పిలుపునివ్వడం, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి నిరసనలు తెలపాలని కోరిన విషయం తెలిసిందే. రేవంత్‌ వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ పార్టీ ఫిర్యాదు చేయగా, సీఎం సభ రోజు శాంతిభద్రతల సమస్య రాకుండా ‘అవసరమైన చర్యలు’ తీసుకోవాలని మాత్రమే సీఈఓ పోలీసు శాఖకు ఆదేశించారని అధికారవర్గాలంటున్నాయి. రేవంత్‌ దుందుడుకు స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుని ముందు జాగ్రత్త చర్యగా ఆయనను అరెస్టు చేయాలని ఎస్పీ అన్నపూర్ణ నిర్ణయం తీసుకున్నారని, ఆయన్ను అరెస్టు చేసి తరలించకుండా గృహ నిర్బంధంలో ఉంచితే వివాదానికి అవకాశముండేది కాదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. రేవంత్‌ అరెస్టు పట్ల ఎన్నికల సంఘం పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతుండటంతో సీఈఓ తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు సమాచారం. గత రెండ్రోజులుగా ఆయన విలేకరులను సైతం కలవడానికి ఇష్టపడకపోవడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement