రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈవీఎంలపై అవగాహన కల్పిస్తున్న ఈసీ రజత్‌కుమార్
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల్లో అవినీతి, అక్రమాలు, కోడ్ ఉల్లంఘనలకు సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ‘సీ–విజిల్’అనే వినూత్న మొబైల్ యాప్‌ను తొలిసారిగా వినియోగంలోకి తెచ్చిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ పేర్కొన్నారు. గూగుల్ స్టోర్స్ నుంచి ఆ యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని వినియోగించొచ్చని సూచించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఈ యాప్‌లో అప్‌లోడ్ చేస్తే నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి చేరుతాయని వివరించారు. అక్కడి నుంచి 5 నిమిషాల్లోగా సంబంధిత జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేరుతుందని, 30 నిమిషాల వ్యవధిలో సంఘటన స్థలానికి అధికారుల బృందం చేరుకుంటుందని, గంటలోపు కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక వెళ్తుందని చెప్పారు.
ఎన్నికల్లో అక్రమాలను నిర్మూలించేందుకు ఈ యాప్‌ను విస్తృతంగా వినియోగించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాల అవగాహన కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఈవీఎం యంత్రాలు సమకూరాయని, 85 శాతం ఈవీఎంలకు ప్రథమ స్థాయి పరీక్షలు నిర్వహించామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో 10 మొబైల్ వాహనాల ద్వారా ఈవీఎంల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈవీఎం, వీవీప్యాట్‌లపై వినియోగంపై ఓటర్లలో అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
బ్యాలెట్ యూనిట్‌పై ఓ అభ్యర్థికి ఓటేసిన వెంటనే వీవీప్యాట్ యంత్రం డిస్‌ప్లే స్క్రీన్‌పై ఎవరికి ఓటు వేశామో తెలిపే రశీదు వస్తుందని, ఏడు సెకన్ల తర్వాత రశీదు ఓ పెట్టెలో పడుతుందని వివరించారు. రశీదును ఓటర్లకు ఇవ్వరన్నారు. ఓటు వేరే అభ్యర్థికి పడినట్లు రశీదు చూపిస్తే తక్షణమే ఎన్నికల ప్రిసైడింగ్ అధికారికి ఓటర్లు ఫిర్యాదు చేయాలని సూచించారు. పోలింగ్‌ను నిలిపేసి ఈవీఎంలను పరీక్షించి చూస్తారని, ఒకవేళ ఫిర్యాదు వాస్తవమైతే కొత్త ఈవీఎంతో పోలింగ్ కొనసాగిస్తారన్నారు. 440 మంది ఇంజనీర్లు ఈవీఎంలకు పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ విషయంలో తప్పుడు ఫిర్యాదు చేసిన వారిపై 6 నెలల జైలు శిక్ష విధించే అవకాశముందన్నారు.
సరైన దిశలో ఏర్పాట్లు..
రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లు సరైన దిశలో కొనసాగుతున్నాయని రజత్ కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఏర్పాట్లలో పురోగతిపై 30 పాయింట్ల కార్యాచరణ ప్రణాళికతో కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పించినట్లు తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం కింద 28.25 లక్షల దరఖాస్తులు రాగా, అందులో 11.7లక్షల దరఖాస్తులను పరిష్కరించాల్సి ఉందన్నారు. ఈ నెల 4లోగా దరఖాస్తుల పరిశీలన పూర్తి అవుతుందని చెప్పారు. ఓటర్ల సంఖ్య పెరగనుందని, అవసరమైతే అదనపు పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామన్నారు. 100 అదనపు పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను సరఫరా చేసేందుకు బీహెచ్‌ఈఎల్ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసిందని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో 13 శాతం ఓటర్లు పెరిగారన్నారు. ఏపీలో 7 మండలాలు విలీనం కావడంతో భద్రాచలంలో 40 శాతం, అశ్వరావుపేటలో 21 శాతం ఓటర్లు తగ్గినట్లు చెప్పారు. పోలింగ్ నిర్వహణకు అదనంగా 30 శాతం సిబ్బందిని నియమించుకోనున్నట్లు తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, కేంద్ర బలగాల అవసరాలపై ఇప్పటికే పోలీసు శాఖ నివేదిక సమర్పించిందన్నారు.
ఈసీ దృష్టికి ఈ రెండు పథకాలు
రైతుబంధు, బతుకమ్మ చీరల పంపిణీపై రాజకీయ పార్టీల నుంచి వచ్చిన అభ్యంతరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించామని, దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందని రజత్ కుమార్ తెలిపారు. మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ మెరుగ్గా ఉందన్నారు. రాష్ట్రంలో 4.16 లక్షల వికలాంగ ఓటర్లున్నారని, వారికి పోలింగ్ రోజు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. అంధ ఓటర్లకు బ్రెయిలీ లిపిలో ఓటరు గుర్తింపు కార్డు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. కార్యక్రమంలో అదనపు ఎన్నికల ప్రధాన అధికారి జ్యోతి బుద్ధప్రకాశ్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లోకేశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment