దేశ రాజధానిలో గజం భూమి ఏడాదికి లీజుకు తీసుకుంటే ఎంత అవుతుంది? ఎవరికైనా ఏమో గానీ.. కేజ్రీవాల్ సర్కారుకు మాత్రం ఒక్క రూపాయికే ఇస్తామని కేంద్రం చెబుతోంది. ప్రభుత్వ ఆస్పత్రులు, నైట్ షెల్టర్లు, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి ఢిల్లీలో తమకు స్థలం దొరకడం లేదంటూ కేజ్రీవాల్ సర్కారు ఆరోపించడంతో.. దానికి సమాధానంగా ఇలాంటి వాటికి డీడీఏ ఏడాదికి గజం భూమికి ఒక్క రూపాయే లీజుకు ఇస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. ప్రజోపయోగ సేవల కోసం నామమాత్రపు ధరకే భూములు ఇస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం యాడ్స్ మాత్రమే ఇస్తోందని, తాము మాత్రం అభివృద్ధిని యాడ్ చేస్తూ వెళ్తున్నామని ఆయన కేజ్రీవాల్కు చురక వేశారు.
కనీసం ఆస్పత్రులు కట్టాలన్నా తమకు భూములు దొరకడం లేదని ఢిల‍్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల ఆరోపించారు. వాణిజ్యపరంగా అయితే చదరపు మీటరుకు లీజు రూ. 1.82 లక్షల నుంచి రూ. 6.72 లక్షల వరకు ఉంది. కనీసం లాభనష్టాలు లేని ప్రాతిపదికన అయినా చదరపు మీటరుకు రూ. 11,745 చొప్పున వసూలు చేస్తున్నారు. దీంతో డీడీఏ నుంచి జోనల్ వేరియంట్ రేటు ప్రకారం ఢిల్లీ ప్రభుత్వానికి భూములు అందుబాటులోకి వస్తాయి. కేవలం ఆస్పత్రులు, కార్యాలయాలకే కాక సిబ్బంది క్వార్టర్లు, స్కూళ్లు తదితరాలకు కూడా తక్కువ ధరలకే భూములు లీజుకు ఇస్తామని వెంకయ్య నాయుడు తెలిపారు.
గజం భూమికి ఏడాది లీజు ఒక‍్క రూపాయే
Published Tue, Jul 12 2016 2:22 PM | Last Updated on Mon, Sep 4 2017 4:42 AM
Advertisement