వరి, పప్పు ధాన్యాలకు 2016–17 ఖరీఫ్ సీజన్‌కు కనీస మద్దతు ధరను బుధవారం కేంద్రం పెంచింది.
సాక్షి, న్యూఢిల్లీ
వరి, పప్పు ధాన్యాలకు 2016–17 ఖరీఫ్ సీజన్‌కు కనీస మద్దతు ధరను బుధవారం కేంద్రం పెంచింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో విస్తారంగా సాగయ్యే వరి ధాన్యానికి మద్దతు ధరను నామమాత్రంగా క్వింటాలుకు రూ. 60 మాత్రమే పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ పెరుగుదల రేటు 4.3 శాతమే. అయితే.. అనూహ్యంగా పెరిగిన పప్పు ధరలను అదుపుచేసే ప్రయత్నంలో భాగంగా.. పప్పు ధాన్యాల పంటల సాగును ప్రోత్సహించేందుకు వీటికి మద్దతు ధరను గణనీయంగా పెంచింది. ‘వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్’ సిఫారసులకు అదనంగా రైతులకు మేలు చేసేందుకు మరింత బోనస్ ఇచ్చినట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్ సింగ్ తెలిపారు.
ఈ ధరలు ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఇప్పటివరకు కామన్ గ్రేడ్ వరికి రూ. 1,410 ఉన్న మద్దతు ధరను రూ. 1,470కు పెంచింది. రూ. 1,450 ఉన్న గ్రేడ్–ఏ రకం వరికి మద్దతు ధర రూ.1,510కి పెరిగింది. ప్రస్తుతానికి కేంద్రం వద్ద సరిపడినంత స్థాయిలో బియ్యం నిల్వ ఉన్నందున వరికి ఈ మద్దతు ధరలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, గతేడాది విదేశాల నుంచి పప్పు ధాన్యాలను దిగుమతి చేసుకోవాల్సి రావటంతో ఈసారి ఆ పరిస్థితి రాకుండా దేశీయంగా ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో పప్పు ధాన్యాలకు బోనస్‌ను పెంచినట్లు మంత్రి తెలిపారు. 2015–16లో క్వింటాలుకు రూ. 4,625గా ఉన్న కందులకు మద్దతు ధరను 9.2 శాతం మేర పెంచుతూ రూ. 5,050గా ప్రకటించింది. గతేడాది కందులకు బోనస్ రూ.200 ఉండగా.. ఈ ఏడాది మద్దతు ధరలో రూ.425 బోనస్ సమ్మిళితమై ఉంది. మినుములకు 8.1 శాతం బోనస్ ఇస్తూ.. ఇప్పటివరకు క్వింటాలుకు రూ. 4,625గా ఉన్న మద్దతు ధరను ఈఖరీఫ్‌లో రూ. 5 వేలకు పెంచింది. పెసర క్వింటాలుకు ఇప్పటివరకు మద్దతు ధరను రూ. 4,850 నుంచి రూ. 5,225 కు (7.7 శాతం పెంపు) పెంచుతూ ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది.
వేరుశనగకు గతేడాది రూ. 4,030 మద్దతు ధర ఉండగా ఈ ఏడాది బోనస్ రూ. 100తోపాటు అదనంగా రూ. 90 కలిపి మొత్తంగా క్వింటాలుకు రూ. 4,220గా ప్రకటించింది. నువ్వులకు రూ. 4,700 మద్దతు ధరల ఉండగా.. దీన్ని రూ.5,000లకు పెంచింది. సోయాబీన్ మద్దతు ధరను రూ. 175, పొద్దుతిరుగుడు పువ్వు కు రూ.150 పెంచినట్లు రాధా మోహన్ సింగ్ వెల్లడించారు. మీడియం స్టేపుల్ పత్తి రకానికి ప్రస్తుతం ఉన్న రూ. 3800 ధరకు రూ. 3,860 పెంచారు. అదేవిధంగా.. లాంగ్‌స్టేç³#ల్ రకానికి ప్రస్తుతం ఉన్న రూ. 4,100 ధరను రూ. 4,160లకు పెంచినట్లు ఆయన తెలిపారు.దీంతోపాటు రాగికి రూ.75, జొన్నకు రూ.60, సజ్జలకు రూ.55, మొక్కజొన్నకు రూ.40 మద్దతు ధర పెంచినట్లు మంత్రి వెల్లడించారు.
మరిన్ని కేబినెట్ నిర్ణయాలు
చెన్నై మెట్రోరైలు లైను మొదటి దశ పనులను మరో 9 కిలోమీటర్లు పొడగించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వాషర్‌మ్యాన్‌పేట్ నుంచి వింకోంగార్ వరకు లైనును పొడగించనున్న ఈ లైనుతోపాటు రూ.3,770 కోట్ల ప్రతిపాదిత తొలిదశ ప్రాజెక్టును మార్చి 2018 కల్లా పూర్తిచేయన్నట్లు కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. దీంతోపాటు వన్యప్రాణి సంరక్షణకు సంబంధించి అమెరికాతో చేసుకునే ఒప్పందానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.
ధాన్యం పాత ఎంఎస్‌పీ కొత్త ఎంఎస్‌పీ పెంపు
వరి 1,410 1,470 60
కందులు 4,625 5,050 425
పెసలు 4,850 5,225 375
మినుములు 4,625 5,000 375
వేరుశనగ 4,030 4,220 190
నువ్వులు 4,700 5,000 300
పత్తి 3,800 3,860 60