ముంబై: జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్) అప్‌గ్రెడేషన్‌పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నప్పటికీ కేంద్రం వెనక్కి తగ్గేలా లేదు. 2015 నాటి ప్రతిపాదనలను తెరపైకి తెచ్చి, తాజాగా బ్యాంకుల ద్వారా వివరాలను సేకరించేందుకు యోచిస్తోంది. మనీల్యాండరింగ్ నిబంధనలు–2005ను సవరిస్తూ కేంద్ర ఆర్థిక శాఖలోని రెవెన్యూ విభాగం 2015 జూలై 7వ తేదీన రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)కి ఒక సర్క్యులర్ జారీ చేసింది. వినియోగదారుల నుంచి అధికారిక ధ్రువీకరణ పత్రాలతోపాటు ‘నో యువర్ కస్టమర్’ వివరాల్లో భాగంగా ఎన్పీఆర్‌ను సేకరించాలని అందులో సూచించింది. కారణాలు వెల్లడి కానప్పటికీ, మూడేళ్ల తర్వాత ఆర్బీఐ 2018 ఏప్రిల్‌లో కేవైసీలో ఎన్పీఆర్‌ను భాగంగా మార్చుతూ ఆదేశాలిచ్చింది.
అయితే, ఈ నెల 9వ తేదీన దీనిని ఆర్బీఐ ప్రకటించడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమయింది. ‘బ్యాంకింగ్ కార్యకలాపాలు, కొత్త అకౌంట్లకు ఈ వివరాలు తీసుకోవాలన్న ఆర్బీఐ సూచనలను అమలు చేస్తున్నాం. కొందరు భావిస్తున్నట్లుగా ఎన్పీఆర్ వివరాలివ్వడం తప్పనిసరి మాత్రం కాదు’అని ఆర్బీఐ ఎండీ పల్లవ్ మహాపాత్ర తెలిపారు. కాగా, కేరళ ప్రభుత్వం ఎన్పీఆర్ విషయంలోనూ కేంద్రంతో విభేదిస్తోంది. ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆందోళనల దృష్ట్యా దీనిని అమలు చేయబోమని కేంద్రానికి తెలపాలని సీఎం విజయన్ నేతృత్వంలో కేబినెట్ భేటీ నిర్ణయించింది. ఎన్సార్సీని అమలు చేయబోమంటూ కేరళ అసెంబ్లీ తీర్మానం చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment