యజమానులే దొంగలయ్యారు..
చండీగఢ్: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం యజమానులే దొంగలుగా మారారు. తమ నగల దుకాణంలో దోపిడీ చేయించి పోలీసులకు దొరికిపోయారు. చండీగఢ్లో ఈ ఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి.
వినోద్, రజనీష్ వర్మ అనే సోదరులు నగల దుకాణం నిర్వహిస్తున్నారు. జ్యువెలరీ షాపులోని 14 కోట్ల రూపాయల విలువైన నగలకు 10 కోట్ల రూపాయలకు ఇన్సూరెన్స్ చేయించారు. అక్రమమార్గంలో ఇన్సూరెన్స్ డబ్బులు క్లైమ్ చేసుకోవాలని దురాశపడ్డ వర్మ సోదరులు దోపిడీకి పథకం పన్నారు. దొంగతనం చేయడానికి తమ బంధువులనే రంగంలోకి దింపారు. శనివారం ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తి జ్యువెలరీ షాపునకు వచ్చి ఉంగరం కోసం ఆర్డర్ ఇచ్చారు. మరుసటి రోజు ఆదివారం ముగ్గురు వచ్చి తుపాకీతో బెదిరించి సెక్యూరిటీ గార్డు, స్టాఫ్ను ఓ రూమ్లో బంధించి నగలు దోచుకెళ్లారు. ఆధారాలు లేకుండా చేసేందుకు సీసీటీవీలో మెమొరీ కార్డును తొలగించారు.
తమ పథకం అమలు చేసిన వర్మ సోదరులు.. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వీరి ప్రవర్తనపై పోలీసులకు అనుమానం వచ్చింది. పోలీసుల విచారణ నుంచి తప్పించుకునేందుకు ఇద్దరూ ఆస్పత్రిలో చేరారు. పోలీసులు వర్మ సోదరులపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.