
ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా?
న్యూఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజల గొంతు వినపడకుండా చేసేందుకు విపక్ష ఎమ్మెల్యేలను విచ్చలవిడిగా కొంటున్నారని ఆరోపించారు. ఢిల్లీలో మంగళవారం సాయంత్రం పార్టీ నాయకులతో కలిసి వైఎస్ జగన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తమ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తామని ప్రలోభపెట్టి టీడీపీలో చేర్చుకుంటున్నారని, ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా అని ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతి, అక్రమాలపై నిలదీస్తున్నందుకే తమ పార్టీ ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపించారు.
వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే
- ఏపీలో ఎమ్మెల్యేలను విచ్చలవిడిగా కొంటున్నారు
- ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 20 కోట్లు నుంచి రూ. 30 కోట్లు ఇస్తున్నారు
- చంద్రబాబుకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది?
- తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ చంద్రబాబు అడ్డంగా దొరికిపోయాడు
- తెలంగాణలో మొదలు పెట్టిన చంద్రబాబు ఏపీలో కూడా ఎమ్మెల్యేలను కొంటున్నాడు
- ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా?
- డబ్బులతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమే కాకుండా కొంతమందికి మంత్రి పదవులు ఇస్తానని చెబుతున్నాడు
- వేరే పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించకుండా పార్టీలో చేర్చుకుంటున్నాడు
- అనర్హత వేటు పడకుండా వాళ్ల చేత మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేయిస్తానని చెబుతున్నాడు
- ఇంతకన్నా దిక్కుమాలిన పరిస్థితి ప్రజాస్వామ్యంలో ఉంటుందా?
- ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేస్తున్నారు
- గత ఎన్నికల్లో మాకు 45 శాతం ఓట్లు, టీడీపీ కూటమికి 46 శాతం చిల్లర ఓట్లు వచ్చాయి
- రెండు పార్టీలకు మధ్య తేడా కేవలం 1.86 శాతం మాత్రమే
- కొంతమంది పార్టీ మారినంత మాత్రానా పార్టీకి నష్టం లేదు
- చంద్రబాబు ప్రజల గొంతు నొక్కుతున్నాడు
- చంద్రబాబు మోసపూరిత విధానాలతో ప్రజలు బాధ పడుతున్నారు
- ఏపీలో ప్రతిచోటా చంద్రబాబుపై వ్యతిరేకత కనిపిస్తోంది
- ఆయన చేస్తానన్న రుణమాఫీ వడ్డీలో మూడో వంతుకు కూడా సరిపోదు
- చంద్రబాబును రైతులు తిట్టిన తిట్టుకుండా తిడుతున్నారు
- రెండేళ్లలో రెండుసార్లు కరెంట్ చార్జీలు పెంచారు, ఆర్టీసీ చార్జీలు పెంచారు
- చంద్రబాబు పాలనలో ప్రతి విషయంలో ప్రజలు విసిగెత్తి పోయారు
- తనపై ప్రజావ్యతిరేకత పెరగడంతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే కార్యక్రమం చేస్తావున్నాడు
- ప్రజల గొంతు వినపడకూడదన్న దిక్కుమాలిన ఆలోచనతో ఇదంతా చేస్తున్నాడు
- చంద్రబాబు రెండేళ్లలో 31 స్కామ్ లు చేశాడు, రూ. లక్షా 34 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు
- అన్ని వివరాలను 'ఎంపరర్ ఆఫ్ కరప్షన్' పుస్తకంలో పొందుపరిచాం
- సీబీఐ విచారణ జరిపితే అన్ని విషయాలు బయటకు వస్తాయి
- ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ఘనకార్యమా?
- కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలతో ఎందుకు రాజీనామా చేయించడం లేదు?
- ఈ ఎమ్మెల్యేలను ప్రజల ముందుకు ఎందుకు తీసుకెళ్లడం లేదు?
- పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ చంద్రబాబు రాజకీయ వ్యభిచారం చేస్తున్నాడు
- రాజకీయ వ్యభిచారం ఎవరు చేసినా తప్పే అవుతుంది