సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన నెలరోజుల వ్యవధిలోనే కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరంను ఏవియేషన్ స్కామ్‌కు సంబంధించి ఈడీ శుక్రవారం ప్రశ్నించింది. ఆరు గంటల పాటు ఈడీ అధికారులు చిదంబరాన్ని ప్రశ్నించినట్టు సమాచారం. కాగా ఈ కేసుకు సంబంధించి 2019 ఆగస్ట్ 23న తమ ఎదుట హాజరు కావాలని ఈడీ చిదంబరానికి గతంలో సమన్లు జారీ చేయగా ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో ఆగస్ట్ 20న సీబీఐ ఆయనను అరెస్ట్ చేయడంతో హాజరు కాలేకపోయారు.
ఎయిర్ ఇండియా ఎయిర్‌క్రాఫ్ట్ కొనుగోలుకు సంబంధించిన ఈ కేసులో సంబంధిత ఫైల్‌కు పీ చిదంబరం ఆమోదం తెలిపారని తేలడంతో ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. 2009లో ఎయిర్‌బస్ నుంచి 43 విమానాలు కొనుగోలు చేయాలనే కాంట్రాక్టును పీ చిదంబరం నేతృత్వంలోని మంత్రుల కమిటీ ఖరారు చేసినట్టు సమాచారం. ఈ డీల్‌ను భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ముందుకు పంపినప్పుడు సదరు కంపెనీ శిక్షణా సదుపాయాలు, నిర్వహణ, మరమ్మత్తుల (ఎంఆర్‌ఓ) కేంద్రాలు అభివృద్ధి చేయాలనే షరతులను చేర్చి కొనుగోలు ఆర్డర్‌లో మాత్రం ఆ క్లాజ్‌ను తొలగించినట్టు ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment