సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశ వ్యాప్తంగా 64 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు రంగం సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల ప్రకటన వెలువడగానే రాజకీయ పార్టీలు, ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు, నాయకులు ఆర్భాటం చేయడం సహజం. కానీ దేశంలో ఎన్నడూ లేని విధంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈసారి ఎన్నికల్లో కేంద్ర బిందువుగా మారింది. ఎన్నికల వేళ ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకులపై దాడులకు పాల్పడుతూ వారికి చుక్కలు చూపిస్తోంది. ఇదంతా కేంద్రంలోని బీజేపీ కుట్రగా విపక్షాలు విమర్శలు గుప్పిస్తుంటే.. అవినీతిపరులను వదిలేది లేదంటూ ప్రభుత్వం హెచ్చరికలు జారీచేస్తోంది. వెరసి దేశంలో తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో అధికార, విపక్ష విమర్శలు, ఆరోపణలకు ఈడీ ప్రధాన కేంద్రంగా మారింది. దీంతో తమపై రాజకీయ కక్షసారింపు కోసమే కేంద్రం ఈడీ అనే అస్త్రంను ప్రయోగిస్తోందని విపక్ష పార్టీల సభ్యులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు కేంద్రం చేతిలో ఈడీ కీలుబొమ్మగా మారిందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
పెద్దల చుట్టూ కేసుల ఉచ్చులే..
ఈడీ దాడులతో ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం, కర్ణాటక ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‌లు జైలులో ఉండగా.. తాజాగా మహారాష్ట్ర మాజీ సీఎం, ఎన్సీపీ నేత శరద్ పవార్‌పై ఈడీ ఉచ్చు బిగుసుకుంది. మహారాష్ట్ర రాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంక్ (ఎంఎస్‌సీబీ)లో రూ.25 వేల కోట్ల కుంభకోణానికి సంబంధించి వీరిపై మనీల్యాండరింగ్ కేసు నమోదు చేసినట్లు ఈడీ ఇటీవల తెలిపింది. దీనిపై ఆయన్ను త్వరలోనే విచారించే అవకాశం ఉంది. ఈ పరిణామం ఆ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పవార్‌పై ఇలాంటి తప్పుడు కేసులు పెడుతూ.. వేధిస్తున్నారని విపక్ష పార్టీలు కేంద్రంపై మండిపడుతున్నాయి. తాజాగా పవర్‌కు మద్దతుగా బీజేపీ మిత్ర పక్షం శివసేన కూడా స్వరం వినిపించింది. ఈ కుంభకోణంలో పవార్ తప్పేమీలేదని ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ అభిప్రాయపడ్డారు. అయితే పవార్‌ను కేసులో ఇరికించేందుకు బీజేపీ పెద్ద ఎత్తున కుట్ర పన్నిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇటీవల మహారాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దీని వెనక ప్రధాన పాత్ర పోషించారని విమర్శిస్తోంది. అయితే అమిత్ షా రెండు రోజుల పర్యటన ముగిసిన తెల్లారే పవార్‌పై కేసు నమోదు కావడం గమనార్హం. మరో కీలక నేత, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎన్‌ఎన్‌ఎస్పీ) చీఫ్ రాజ్‌ఠాక్రేకు కూడా ఓ కేసు నిమిత్తం ఈడీ నోటీసు జారీ చేసింది.
మరోవైపు కర్ణాకటలో 15 అసెంబ్లీ స్థానాలకు జరగాల్సిన ఉప ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్‌కు కఠిన పరీక్షగా మారాయి. ఈ ఎన్నికల్లో నెగ్గడం బీజేపీకి ఎంతో అవసరం. దీంతో సీనియర్ నేత, ట్రబుల్ షూటర్‌గా పేరొందిన డీకే శివకుమార్‌ను కట్టడి చేయాలని ప్రభుత్వం భావించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిలో భాగంగానే ఆగమేఘాల మీద ఈడీ శివకుమార్‌కు సమన్లు జారీ చేసింది. ఈ దాడి అనంతరం శివకుమార్ వద్ద రూ.300 కోట్లకు పైగా లెక్కలు చూపని ఆస్తి ఉన్నట్లు ఈడీ గుర్తించింది. మరోక్షణం ఆలస్యం చేయకుండా అతన్ని జైలుకు పంపింది. ఆయనతో పాటు ఆయన కుమార్తె ఐశ్వర్యనూ ఈడీ విచారించింది. దీంతో ఎన్నికలను కొంత సునాయాసంగా ఎదుర్కొవచ్చని బీజేపీ భావిస్తోన్నట్లు హస్తం నేతలు విమర్శ. డీకే అరెస్ట్‌పై కన్నడ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ కక్షసాధింపుతోనే ఆయనను టార్గెట్ చేశారని హస్తం నేతలు మండిపడుతున్నారు.
వీడని వాద్రా కేసులు..
మరోవైపు హర్యానా అసెంబ్లీకి ఎన్నికల ప్రకటన వెలువడింది. సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా ఇప్పటికే ఈడీ, సీబీఐ కేసులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రకటన వెలువడటంతో కేసు విచారణను ఈడీ మరింత వేగవంతం చేసింది. కోర్టు అనుమతితో విదేశాలకు వెళ్లిన ఆయనను ఏ క్షణమైన ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. కాగా బికనీర్ భూముల కుంభకోణంలో ఆయన ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇదిలావుండగా.. హర్యానా మాజీ సీఎం భూపేందర్ సింగ్ హూడాని కూడా ఈడీ వదల్లేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అక్రమంగా భూలావాదేవీలు జరిపారని ఈడీ ఆరోపిస్తోంది. దీనిపై ఆయన ఇదివరకే ఈడీ నుంచి నోటీసులను కూడా అందుకున్నారు. రాష్ట్రంలో ఎన్నికల జరుగుతుండటంలో అధికార బీజేపీకి ఆయనపై ఉన్న కేసులే ప్రధాన అస్త్రంగా మారాయి. ఇక చిదంబరం అరెస్ట్ దేశ వ్యాప్తంగా పెద్ద చర్చకే దారితీసింది. కీలకమైన ఎన్నికలు, దేశంలో ఆర్థిక సంక్షోభం వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకునే ఆయన్ని జైలుకు పంపారని విపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment