సాక్షి, ముంబై: ఐఎన్‌ఎక్స్ మీడియా వివాదంలో ఇప్పటికే చిక్కుల్లో పడ్డ కాంగ్రెస్ సీనియర్ నేత , కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పి. చిదంబరం చుట్టూ మరింత ఉచ్చు బిగించేందుకు బీజేపీ సర్కార్ తీవ్ర కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న డైమండ్ వ్యాపారి మెహుల్ చోక్సీ భారీ అక్రమాలకు, కుంభకోణానికి యూపీయే ఆధ్వర్యంలోని బంగారం దిగుమతి పథకం ఊతమిచ్చిందని ఆరోపిస్తోంది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చిదంబరంపై సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం చిదంబరం ఆశీర్వాదంతోనే గీతాంజలి గ్రూపు మెహల్ చోక్సి సహా మిగిలిన ఏడు కంపెనీలు అక్రమాలకు పాల్పడ్డాయంటూ తీవ్ర ఆరోపణలకు దిగారు.
వివాదాస్పదమైన ఈ నిబంధనను 2013లో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిందని కేంద్రమంత్రి దుయ్యబట్టారు. దిగుమతి చేసుకున్న బంగారంలో 20శాతం ఎగుమతి చేసిన తరువాత మాత్రమే బంగారం దిగుమతులకు ట్రేడర్లకు అనుమతి లభించేలా 80:20 నియమాన్ని తెచ్చారన్నారు. తత్ఫలితంగానే ఏడు ప్రయివేటు కంపెనీలు భారీ అక్రమాలకు పాల్పడ్డాయని ఆరోపించారు. ఈ పథకానికి ఎందుకు అనుమతినిచ్చారో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, చిదంబరం ఇపుడు సమాధానం చెప్పాలని రవిశంకర ప్రసాద్ డిమాండ్ చేశారు. అయితే ఎన్‌డీఐ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నవంబర్‌లో ఈ నిబంధనను తాము రద్దు చేశామన్నారు.
ఇది ఇలా ఉంటే 80:20 బంగారు దిగుమతి పథకానికి సంబంధించి అన్ని వివరాలను ఆర్థిక మంత్రిత్వశాఖ అధికారులు పార్లమెంటరీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ముందు ఉంచనున్నారని పీటీఐ నివేదించింది. రానున్న పదిరోజుల్లో ఈ వివరాలను అందించనున్నారని తెలిపింది. కాగా ఐఎన్‌ఎక్స్ కేసు లో చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం ఇప్పటికే సీబీఐ అరెస్ట్ చేసింది. మరోవైపు ఈ కేసు విచారణలో మరో కీలక నిందితురాలు, ఐఎన్‌ఎక్స్ మీడియా మాజీ డైరెక్టర్ ఇంద్రాణి ముఖర్జీ వాంగ్మూలం ఆసక్తికరంగామారింది. కార్తి చిదంబరానికి సాయం చేయాలని స్వయంగా అప్పటి కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం తనను కోరారని సీబీఐ విచారణలో ఆమె చెప్పింది. దీంతో మాజీ ఆర్థికమంత్రి మరిన్ని ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే చిదంబరాన్ని కూడా సీబీఐ ప్రశ్నించనుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment