న్యూఢిల్లీ: రాజ్యసభలో సోమవారం అరుదైన గొడవ చోటుచేసుకుంది. సభ కార్యకలాపాలపై ఆర్థిక మంత్రి చిదంబరం, సభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ వాగ్యుద్ధానికి దిగారు. దీంతో గందరగోళం చెలరేగి సభ గంటపాటు స్తంభించింది. హింసతో అట్టుడుకుతున్న కాశ్మీర్‌లోని కిష్ట్‌వార్ పరిస్థితిపై మాట్లాడేందుకు కురియన్ విపక్ష నేత అరుణ్ జైట్లీకి అనుమతివ్వడంతో రభస మొదలైంది. కాశ్మీర్ ప్రభుత్వం జైట్లీని కిష్ట్‌వార్‌కు వెళ్లకుండా అడ్డుకున్న నేపథ్యంలో ఈ అంశంపై మాట్లాడేందుకు ఆయనకు అనుమతివ్వాలన్న బీజేపీ సభ్యుల విజ్ఞప్తికి కురియన్ స్పందించి జైట్లీని పిలిచారు. అయితే చిదంబరం జోక్యం చేసుకుని కిష్ట్‌వార్‌పై ప్రకటన చేస్తానని, మొదట తననే మాట్లాడనివ్వాలని పట్టుబట్టారు. కురియన్ ఒప్పుకోలేదు.
చిదంబరం ప్రకటన చేయాలని అనుకుంటే ముందే తనకు చెప్పి ఉండాల్సిందన్నారు. దీంతో చిదంబరం నిరసన వ్యక్తం చేస్తూ ‘ఇది పూర్తిగా కొత్త సంప్రదాయం’ అని అన్నారు. చిదంబరానికి కాంగ్రెస్ సభ్యులు మద్దతు పలికారు. ప్రభుత్వం తరఫున ప్రకటన చేసేందుకు అనుమతివ్వాలని కోరారు. కురియన్ వారి విజ్ఞప్తిని తోసిపుచ్చారు. చిదంబరమూ వెనక్కి తగ్గలేదు. మరోపక్క బీజేపీ కూడా కాంగ్రెస్ తీరుపై నిరసన తెలపడంతో రభసకు దారితీసింది. దీంతో కురియన్ సభను అరగంట వాయిదా వేశారు. సభ మధ్యాహ్నం 12.40కి తిరిగి మొదలు కాగానే గొడవ కూడా మొదలైంది. సాధారణంగా సభలో ముందుగా మాట్లాడే అవకాశాన్ని ప్రభుత్వమే తీసుకుంటుందని, అయితే తాను విపక్ష నేతను అప్పటికే పిలవడంతో ఆయనే మాట్లాడడం సబబని కురియన్ చెప్పారు. జైట్లీ మాట్లాడిన తర్వాత ఆర్థిక మంత్రి మాట్లాడాలన్నారు. అయితే జైట్లీ మాట్లాడాక బీఎస్పీ స భ్యుడు సతీశ్ మిశ్రా మాట్లాడేందుకు కురియన్ మొదట్లో అనుమతివ్వడంతో మిశ్రా నిరసన తెలి పారు. గొడవ సద్దుమణగకపోవడంతో ఒంటి గంటవరకు స్తంభించింది. చివరకు జైట్లీ మాట్లాడాక ఇతరులను అనుమతిస్తానని సభాపతి చెప్పడంతో గొడవ సద్దు మణిగింది.
చిదంబరం X కురియన్
Published Tue, Aug 13 2013 1:38 AM | Last Updated on Mon, Aug 20 2018 4:55 PM
Advertisement
Advertisement