సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి ఎన్నికల కమిషన్ షోకాజ్ నోటీస్ జారీ చేయడాన్ని ఆ పార్టీ సీనియర్ నేత పీ చిదంబరం తప్పుపట్టారు. మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చినందుకు రాహుల్‌కు నోటీసులిచ్చిన ఈసీ అదే పని చేసిన బీజేపీ నేతలను ఎందుకు ఉపేక్షించిందని ఆయన ప్రశ్నించారు. ఈసీ వివక్ష ప్రదర్శిస్తోందని, గుజరాత్ ప్రజలు తమ ఓటుతో బీజేపీ సర్కార్‌కు బుద్ది చెప్పాలని చిదంబరం పిలుపు ఇచ్చారు. ‘నిన్న (బుధవారం) ప్రధాని ప్రసంగించారు.
బీజేపీ చీఫ్ అమిత్ షా, రైల్వేమంత్రి ఇంటర్వ్యూలు ఇచ్చారు..వారందరినీ వదిలివేసి కేవలం రాహుల్ గాంధీనే ఎందుకు టార్గెట్ చేశారని‘ ప్రశ్నించారు. ఓటమి నైరాశ్యంలోనే బీజేపీ ఈసీని తమపై ప్రయోగిస్తోందని ఆరోపించారు. ప్రచార గడువు ముగిసిన అనంతరం మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వడం ప్రతి అభ్యర్థి, ప్రచారకుడు అన్ని ఎన్నికల్లో అనుసరిస్తున్న పద్ధతేనని చిదంబరం వ్యాఖ్యానించారు.
పోలింగ్ రోజున ప్రధాని రోడ్డుషోను అనుమతించడం ఎన్నికల నియమావళికి విరుద్ధమన్నారు. ఇది ఎన్నికల ప్రచారం కిందకు వస్తుందని..ఈసీ ఏం చేస్తోందని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment