సీఎం కుర్చీలో శశికళ?
నేడు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అత్యవసర సమావేశం
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు సీఎం పీఠాన్ని శశికళకు అప్పగించడానికి రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను పదవి నుంచి తప్పించి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ సీఎం పదవి చేపట్టడానికి చురుగ్గా ప్రయ త్నాలు సాగుతున్నాయి. ఆదివారం చెన్నై లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎమ్మె ల్యేల సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి సీఎం పన్నీర్ సెల్వంతో పాటు అందరూ తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశాలి చ్చారు. జయలలితకు అత్యంత నమ్మకస్తురాలిగా పేరున్న రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహా దారు షీలా బాలకృష్ణన్ శుక్రవారం రాత్రి రాజీనామా చేశారు. మార్చి నెలాఖరు వరకు ఆమె పదవీకాలం ఉన్నా.. శశికళ ఒత్తిడి మేరకు ముందుగానే రాజీనామా చేసినట్లు సమాచారం.
సీఎం, అధ్యక్ష పదవి ఒకరికే..
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మర ణించిన తరువాత ఆమె నిర్వహిస్తున్న రెండు పదవులను పన్నీర్‌సెల్వం, శశికళ పంచుకున్నారు. అయితే రెండు పదవుల్లో ఒకరే ఉండడం పార్టీ సంప్రదాయమని కొందరు మంత్రులు, పార్టీ సీనియర్ నేత లు చెబుతున్నారు. అందుకే సీఎం పదవి కూడా శశికళకే అప్పగించాలని వాదిస్తు న్నారు. ఈ దశలో సీఎం పన్నీర్‌సెల్వం తన పదవిని కాపాడుకునేందుకు ప్రధాని మోదీని ఆశ్రయించి ఆశీర్వాదం పొందా రు.
అందుకే శశికళ హడావుడిగా పార్టీ ఎమ్మెల్యేల సమావేశం ఏర్పాటు చేసి.. సీఎం పీఠాన్ని వెంటనే దక్కించుకునేలా పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. అయితే శాసనసభాపక్ష నేతగా శశికళను ఎన్నుకునేందుకు వీలుగా పన్నీర్‌సెల్వం రాజీనామా చేయాల్సి ఉంటుంది. తాను రాజీనామా చేస్తున్నట్లు పన్నీర్‌సెల్వం శనివారం రాత్రి వరకు అధికారికంగా ప్రకటించలేదు. అంతేగాక రాజీనామా చేసేందుకు పన్నీర్‌సెల్వం విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకేలో పరిణామాలు ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు బెంగళూరుతో మాట్లాడుతూ చెప్పారు.