ప్రశాంతంగా తొలిదశ పోలింగ్
పశ్చిమ బెంగాల్లో 81శాతం, అస్సాంలో 78.06శాతం
కోల్‌కతా/గువాహటి: పశ్చిమబెంగాల్, అస్సాంలో మొదటి దశ ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. రెండు రాష్ట్రాల్లోను భారీగా పోలింగ్ నమోదైంది. బెంగాల్లో దాదాపు 81 శాతం పైగా పోలింగ్ నమోదవగా, అస్సాంలో 78.06 శాతం ఓటింగ్ జరిగింది. పశ్చిమబెంగాల్లో 294 నియోజకవర్గాలకు గాను 18 చోట్ల, అస్సాంలో 126 స్థానాలకు గాను 65 చోట్ల పోలింగ్ కొనసాగింది. రిగ్గింగ్, ఓట్ల గల్లంతు, ఆలస్యంగా ఓటింగ్‌పై 16 ఫిర్యాదులు అందాయి. పోలింగ్ కోసం రెండు రాష్ట్రాల్లో భారీగా భద్రత బలగాల్ని మోహరించారు. బెంగాల్లో హెలికాప్టర్లతో ఏరియల్ నిఘా నిర్వహించారు.
40.09 లక్షల మంది ఓటర్లలో 81 శాతం ఓటేశారు. 13 స్థానాల్ని ఈసీ మావో ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించడంతో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగించారు. పురులియా, మన్‌బజార్, కాశీపూర్, పారా, రఘునాథ్‌పూర్‌లో సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ సాగింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న తృణమూల్ కాంగ్రెస్ ఈ సారి బెంగాల్ బరిలోకి ఒంటరిగా దిగింది. కాంగ్రెస్‌తో జట్టుకట్టిన లెఫ్ట్ ఫ్రంట్... తృణమూల్‌ను అధికారంలోంచి దించేందుకు హోరాహోరీ తలపడింది.
అస్సాంలో 78.6 శాతం భారీ పోలింగ్
95.11 లక్షల మంది ఓటర్లకు గాను అస్సాంలో 78.06 శాతం పోలింగ్ జరిగింది. మొత్తం 65 నియోజకవర్గాల్లోను ఎక్కడా హింస జరిగినట్లు సమాచారం అందలేదు. అస్సాం మాజీ సీఎం ప్రఫుల్ల కుమార్ మొహంతా పార్టీతో పాటు బోడో పీపుల్స్ ఫ్రంట్‌తో పొత్తుపెట్టుకున్న బీజేపీ అధికారం దక్కించుకునేందుకు తీవ్రంగా శ్రమించింది. మొదటి దశలో పలువురు ప్రముఖులు అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. టిటాబోర్ నుంచి సీఎం తరుణ్ గొగొయ్, సిబ్‌సాగర్ నుంచి ప్రస్తుత స్పీకర్ ప్రణబ్ గొగొయ్‌లు బరిలో ఉన్నారు. మజులి నుంచి బీజేపీ సీఎం అభ్యర్థి, కేంద్ర మంత్రి సరబానంద సొనోవాల్, జొర్హట్ నుంచి లోక్‌సభ సభ్యుడు కామాఖ్య ప్రసాద్‌లు అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కాంగ్రెస్ అన్ని స్థానాల్లో పోటీ చేయగా, బీజేపీ 54 స్థానాల్లో పోటీచేసింది.
బాంబు పేలి ఇద్దరి మృతి..
అస్సాంలోని గోల్‌పారా జిల్లా డుద్‌నయ్‌లో బీజేపీ ఎన్నికల కార్యాలయం వద్ద బాంబు పేలడంతో ఇద్దరు మరణించగా, 20 మంది గాయపడ్డారు. బీజేపీ ఆఫీసు దగ్గర్లో ఉంచిన బ్యాగ్‌లోని బాంబు పేలింది. ఈ ప్రాంతంలో ఏప్రిల్ 11న రెండో దశలో ఎన్నికలు జరగనున్నాయి.