votes go missing
-
ఓట్లు గల్లంతు.. ఓటర్ల ఆందోళన
సాక్షి, విజయవాడ : టీడీపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారమోనని వారి ఓట్లను తీసేసిన ఘటన లబ్బిపేటలో చోటుచేసుకుంది. లబ్బిపేట బూత్ నెం 81లో దాదాపు వెయ్యి ఓట్లు గల్లంతైనట్లు తెలుస్తోంది. ప్రభుత్వమే తమ ఓట్లు తీసేసిందని ఓటర్లు ఆందోళన చేస్తున్నారు. తమకు చంద్రబాబు వాయిస్ కాల్ వచ్చిందని.. ప్రభుత్వ పనితీరు గురించి ఆరా తీశారని తెలిపారు. తాము వ్యతిరేకంగా సమాధానం చెప్పడంతోనే.. తమ ఓట్లను తొలగించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కు అని దాన్ని కాలరాస్తే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఓటు హక్కు కల్పించే వరకు బూత్ నుంచి కదిలేది లేదని బైఠాయించారు. చంద్రబాబే తమ ఓట్లను తీయించారని బాధితులు ఆరోపించారు. -
నేను బతికున్నాలేనట్టేనా..!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : పై ఫోటోలో కనిపిస్తున్న పెద్దాయన పేరు ప్రొఫెసర్ తిమ్మారెడ్డి. వయస్సు 80ఏళ్లు. ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా, రెక్టార్‌గా సేవలందించారు. ఇప్పుడు ప్రతిష్టాత్మక విశాఖ వ్యాలీ స్కూల్‌కు సెక్రటరీగా కరస్పాండెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఓట్ల గల్లంతుపై పత్రికల్లో వార్తలు వస్తుండటంతో ‘ఏమో... తన ఓటు పరిస్థితి ఏమైందోనని...’ నెట్లో చూసుకున్నారు.. కానరాలేదు.. వెంటనే మహా విశాఖ నగరపాలకసంస్థ (జీవీఎంసీ)లోని సంబంధిత విభాగానికి తనకు పరిచయస్తురాలైన వర్సిటీ ఉద్యోగి సునీతారెడ్డిని పంపించారు. సంబంధిత విభాగం వారు తిమ్మారెడ్డి ఓటు లేదని తేల్చేశారు. ఆయన భార్య ఓటు కూడా లేదన్నారు. పైగా అక్కడున్న ఉద్యోగి ‘రెడ్డిగారు ఓటయితే ఎలా ఉంటుందండీ’ అని అన్యాపదేశంగా వ్యాఖ్యానించారు. తిమ్మారెడ్డి ఓటే కాదు.. సునీతారెడ్డి ఓటు, ఆమె కుటుంబ సభ్యుల ఓట్లు కూడా గల్లంతయ్యాయి. ఇంతకంటే దుర్మార్గం లేదు.. తమ ఓట్లు తొలగింపుపై ప్రొఫెసర్ తిమ్మారెడ్డి తీవ్ర ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు. ఓటు లేదంటే.. తాను బతికున్నా లేనట్టేనా అని వ్యాఖ్యానించారు. ఇప్పటికి 13 ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నాను. ఈ ఎన్నికల్లోనే ఓటు లేదంటున్నారు. పైగా పేరు చివర రెడ్డి అని ఉంటే చాలు ఓటు ఉండదంటున్నారు. ఇంత దుర్మార్గం ఎప్పుడూ చూడలేదు. నా మనుమరాలికి అమెరికాలో ఓటుంది.. కానీ ఇక్కడ మాత్రం నాకు ఓటు లేదంట. కావాలంటే మళ్లీ దరఖాస్తు చేసుకోండి అంటున్నారు. మూడు నెలల కిందట కూడా ఓటుంది.. ఈ మధ్యనే ఓటర్ల జాబితా నుంచి తీసివేశారు. మనం ఎటువంటి ప్రజాస్వామ్యంలో ఉన్నామో అర్థమవుతోంది.. అని తిమ్మారెడ్డి సాక్షి ప్రతినిధి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఓటరు కార్డు నుంచి ఆధార్‌కార్డు వరకు అన్ని కార్డులూ ఉన్నాయి.. అన్నీ ఉన్నా.. నేను బతికే ఉన్నా... నా ఓటును ఎందుకు తొలగించారో ఎన్నికల సంఘం అధికారులు, ప్రభుత్వ అధికారులు సమాధానమివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఏయూ మాజీ వీసీ ఓటూ గల్లంతే.. వీరివే కాదు.. ఓటు గల్లంతుపై ఆరా తీస్తే.. యూనివర్సిటీకి చెందిన చాలామంది ఓట్లు గల్లంతయ్యాయని తెలిసింది. అందులో ప్రధానంగా ఏయూ పూర్వ వైస్ చాన్సలర్ కేవీ రమణ ఓటు కూడా లేదు. ‘2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ సీఎం కావడం చారిత్రక అవసరం.. కాకుంటే చారిత్రక తప్పిదమవుతుంది... ఎందుకంటే నాలుగున్నరేళ్లు గా రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన నడుస్తోంది.. విలువలమీద, మాట మీద నిలబడే జగన్‌వంటి యువనాయకుడే కొత్త రాష్ట్రానికి దిశా, నిర్దేశం ఇవ్వగలరు...’ అని కేవీ రమణ గత ఏడాది సెప్టెంబర్ ఒకటిన విశాఖ నగరంలో జరిగిన మేధావుల సదస్సులో బాహాటంగానే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందుకే ఆయన ఓటును కూడా తొలగించేశారని అంటున్నారు. అదే మాదిరి వైఎస్ జగన్‌కు అనుకూలంగా మాట్లాడే వెల్ఫేర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్ జేమ్స్ స్టీఫెన్ కుటుంబసభ్యుల ఓట్లు కూడా గల్లంతయ్యాయి. -
ఓటుపై వేటు
సాక్షి, కనిగిరి: ఓటమి భయంతో అధికార పార్టీ నేతలు కుతంత్రాలకు తెరలేపారు. ప్రత్యేక సర్వేలు, ప్రభుత్వ సర్వేలు పేరుతో వైఎస్సార్ సీపీ అభిమానుల ఓట్లను తొలగిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కనిగిరి పట్టణంతో పాటు, పామూరు పట్టణంలో సర్వే బృందాల పేరుతో ప్రభుత్వ సర్వే అంటూ హడావిడి చేశారు. ప్రజలు, వైఎస్సార్ సీపీ నాయకులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీంతో కొంత కాలం సద్దుమణిగిన కుట్రదారులు మరలా రెండ్రోజుల క్రితం మండలంలోని బల్లిపల్లి, అడ్డరోడ్డు, కాశీపురం గ్రామాల్లో ప్రభుత్వ సర్వేల పేరుతో గ్రామాల్లో తిరిగారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చామని ప్రభుత్వ పథకాల వివరాలకు అడిగిన తర్వాత వివరాలు చెప్పే వ్యక్తి ఏ పార్టీకి అనుకూలం అనే అంశాలను పొందుపర్చడం. ఫోన్ నెంబర్లు సేకరించడం వంటి చర్యలకు పాల్పడటంతో ప్రజలు తిరగబడ్డారు, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడినుంచి పరారైయ్యారు. 71 ఓట్ల తొలగింపుకు దరఖాస్తులు.. ఓటర్ల జాబితాలో సవరణకు ఎన్నికల కమిషన్ ఇచ్చిన అవకాశాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. కనిగిరి, పామూరు మండలాల్లో కొందరు ఓటర్ల తొలగింపుకు దరఖాస్తు పెట్టినట్లు సమాచారం. కనిగిరి మండలం పేరంగుడిపల్లిలో 71 ఓట్లకు, పామూరు మండలం చిలంకూరు 13 ఓట్ల తొలగింపుకు దరఖాస్తులు వచ్చాయి. పేరంగుడిపల్లిలో ఒకే వ్యక్తి ఆన్లైన్ ద్వారా ఫారం 7 పూర్తి చేసి దరఖాస్తు చేసినట్లు తెలిసింది. మొత్తం 71 ఓట్లను వారి ఓట్లు వారే తొలగించాలని దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొనడంతో అవాక్కైన అధికారులు విచారణ చేపట్టారు. అసలు ఓటరుకు తెలియకుండానే ఓట్లు తొలగించినట్లు దరఖాస్తులు వచ్చినట్లు తెలుసుకున్న రెవెన్యూ అధికారులు సోమవారం రాత్రి కనిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు రకాల కేసులు నమోదు చేశారు. సైబర్ క్రైం కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరినట్లు తహశీల్దార్ కే. రాజ్‌కుమార్ తెలిపారు. -
ప్రశాంతంగా తొలిదశ పోలింగ్
పశ్చిమ బెంగాల్లో 81శాతం, అస్సాంలో 78.06శాతం కోల్‌కతా/గువాహటి: పశ్చిమబెంగాల్, అస్సాంలో మొదటి దశ ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. రెండు రాష్ట్రాల్లోను భారీగా పోలింగ్ నమోదైంది. బెంగాల్లో దాదాపు 81 శాతం పైగా పోలింగ్ నమోదవగా, అస్సాంలో 78.06 శాతం ఓటింగ్ జరిగింది. పశ్చిమబెంగాల్లో 294 నియోజకవర్గాలకు గాను 18 చోట్ల, అస్సాంలో 126 స్థానాలకు గాను 65 చోట్ల పోలింగ్ కొనసాగింది. రిగ్గింగ్, ఓట్ల గల్లంతు, ఆలస్యంగా ఓటింగ్‌పై 16 ఫిర్యాదులు అందాయి. పోలింగ్ కోసం రెండు రాష్ట్రాల్లో భారీగా భద్రత బలగాల్ని మోహరించారు. బెంగాల్లో హెలికాప్టర్లతో ఏరియల్ నిఘా నిర్వహించారు. 40.09 లక్షల మంది ఓటర్లలో 81 శాతం ఓటేశారు. 13 స్థానాల్ని ఈసీ మావో ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించడంతో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగించారు. పురులియా, మన్బజార్, కాశీపూర్, పారా, రఘునాథ్‌పూర్‌లో సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ సాగింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న తృణమూల్ కాంగ్రెస్ ఈ సారి బెంగాల్ బరిలోకి ఒంటరిగా దిగింది. కాంగ్రెస్‌తో జట్టుకట్టిన లెఫ్ట్ ఫ్రంట్... తృణమూల్‌ను అధికారంలోంచి దించేందుకు హోరాహోరీ తలపడింది. అస్సాంలో 78.6 శాతం భారీ పోలింగ్ 95.11 లక్షల మంది ఓటర్లకు గాను అస్సాంలో 78.06 శాతం పోలింగ్ జరిగింది. మొత్తం 65 నియోజకవర్గాల్లోను ఎక్కడా హింస జరిగినట్లు సమాచారం అందలేదు. అస్సాం మాజీ సీఎం ప్రఫుల్ల కుమార్ మొహంతా పార్టీతో పాటు బోడో పీపుల్స్ ఫ్రంట్‌తో పొత్తుపెట్టుకున్న బీజేపీ అధికారం దక్కించుకునేందుకు తీవ్రంగా శ్రమించింది. మొదటి దశలో పలువురు ప్రముఖులు అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. టిటాబోర్ నుంచి సీఎం తరుణ్ గొగొయ్, సిబ్సాగర్ నుంచి ప్రస్తుత స్పీకర్ ప్రణబ్ గొగొయ్‌లు బరిలో ఉన్నారు. మజులి నుంచి బీజేపీ సీఎం అభ్యర్థి, కేంద్ర మంత్రి సరబానంద సొనోవాల్, జొర్హట్ నుంచి లోక్‌సభ సభ్యుడు కామాఖ్య ప్రసాద్‌లు అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కాంగ్రెస్ అన్ని స్థానాల్లో పోటీ చేయగా, బీజేపీ 54 స్థానాల్లో పోటీచేసింది. బాంబు పేలి ఇద్దరి మృతి.. అస్సాంలోని గోల్పారా జిల్లా డుద్నయ్లో బీజేపీ ఎన్నికల కార్యాలయం వద్ద బాంబు పేలడంతో ఇద్దరు మరణించగా, 20 మంది గాయపడ్డారు. బీజేపీ ఆఫీసు దగ్గర్లో ఉంచిన బ్యాగ్‌లోని బాంబు పేలింది. ఈ ప్రాంతంలో ఏప్రిల్ 11న రెండో దశలో ఎన్నికలు జరగనున్నాయి.