బల్లిపల్లిలో సర్వేయువకుడు (ఫైల్)
సాక్షి, కనిగిరి: ఓటమి భయంతో అధికార పార్టీ నేతలు కుతంత్రాలకు తెరలేపారు. ప్రత్యేక సర్వేలు, ప్రభుత్వ సర్వేలు పేరుతో వైఎస్సార్ సీపీ అభిమానుల ఓట్లను తొలగిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కనిగిరి పట్టణంతో పాటు, పామూరు పట్టణంలో సర్వే బృందాల పేరుతో ప్రభుత్వ సర్వే అంటూ హడావిడి చేశారు. ప్రజలు, వైఎస్సార్ సీపీ నాయకులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీంతో కొంత కాలం సద్దుమణిగిన కుట్రదారులు మరలా రెండ్రోజుల క్రితం మండలంలోని బల్లిపల్లి, అడ్డరోడ్డు, కాశీపురం గ్రామాల్లో ప్రభుత్వ సర్వేల పేరుతో గ్రామాల్లో తిరిగారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చామని ప్రభుత్వ పథకాల వివరాలకు అడిగిన తర్వాత వివరాలు చెప్పే వ్యక్తి ఏ పార్టీకి అనుకూలం అనే అంశాలను పొందుపర్చడం. ఫోన్ నెంబర్లు సేకరించడం వంటి చర్యలకు పాల్పడటంతో ప్రజలు తిరగబడ్డారు, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడినుంచి పరారైయ్యారు.
71 ఓట్ల తొలగింపుకు దరఖాస్తులు..
ఓటర్ల జాబితాలో సవరణకు ఎన్నికల కమిషన్ ఇచ్చిన అవకాశాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. కనిగిరి, పామూరు మండలాల్లో కొందరు ఓటర్ల తొలగింపుకు దరఖాస్తు పెట్టినట్లు సమాచారం. కనిగిరి మండలం పేరంగుడిపల్లిలో 71 ఓట్లకు, పామూరు మండలం చిలంకూరు 13 ఓట్ల తొలగింపుకు దరఖాస్తులు వచ్చాయి. పేరంగుడిపల్లిలో ఒకే వ్యక్తి ఆన్‌లైన్ ద్వారా ఫారం 7 పూర్తి చేసి దరఖాస్తు చేసినట్లు తెలిసింది. మొత్తం 71 ఓట్లను వారి ఓట్లు వారే తొలగించాలని దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొనడంతో అవాక్కైన అధికారులు విచారణ చేపట్టారు. అసలు ఓటరుకు తెలియకుండానే ఓట్లు తొలగించినట్లు దరఖాస్తులు వచ్చినట్లు తెలుసుకున్న రెవెన్యూ అధికారులు సోమవారం రాత్రి కనిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు రకాల కేసులు నమోదు చేశారు. సైబర్ క్రైం కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరినట్లు తహశీల్దార్ కే. రాజ్‌కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment