అధికారం కోసం అడ్డదారులు | TDP conspiracy to delete more than 10 lakh votes | Sakshi
Sakshi News home page

అధికారం కోసం అడ్డదారులు

Published Sun, Dec 17 2023 4:56 AM | Last Updated on Sun, Dec 17 2023 7:28 AM

TDP conspiracy to delete more than 10 lakh votes - Sakshi

సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో గెలుపొందడానికి రాజకీయపార్టీలు ప్రయత్నించడం సాధారణం. కానీ.. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ మాత్రం ఇందుకు భిన్నం. అడ్డదారుల్లో గెలుపొందటానికి ప్రయత్నించడం ఆ పార్టీ నైజం. ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడటం ద్వారా ఎన్నికల్లో గెలుపొందడానికి కుట్రలు చేయడం టీడీపీ రివాజుగా మార్చుకుంది. విభజన నేపథ్యంలో 2014 ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో 35 లక్షలకుపైగా దొంగ ఓట్లు చేర్పించి.. కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో అధికారంలోకి రావడం అందరికీ గుర్తుండే ఉంటుంది.

అధికారంలోకి వచ్చాక సేవా మిత్ర యాప్‌తో 2015–17 మధ్య 50.23 లక్షల మంది వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించేలా చంద్రబాబు చక్రం తిప్పారు... ఇపుడు ప్రతిపక్షంలోకి మారినా అదే కుట్రను అమలు చేస్తున్నారు. ప్రజాప్రతినిధ్య చట్టం–1950లో సెక్షన్‌–123(3)కి విరుద్ధంగా మైపార్టీ డ్యాష్‌ బోర్డు.కామ్‌ ఆనే వెబ్‌ సైట్‌ ఏర్పాటుచేశారు. ఈ వెబ్‌సైట్‌ ద్వారా ఏ రాజకీయ పార్టీకి మద్దతు పలుకుతారో వివరాలు సేకరిస్తోంది.

వైఎస్సార్‌సీపీకి మద్దతుగా ఉంటామని చెప్పిన వారిని లక్ష్యంగా చేసుకుంటోంది.. బతికున్నప్పటికీ చనిపోయినట్లు చిత్రీకరించి, నకిలీ అంటూ వక్రీకరించి, శాశ్వతంగా వలస వెళ్లారంటూ మాయచేసి, రెండు చోట్ల ఓట్లు ఉన్నాయంటూ బొంకి.. సుమారు పది లక్షలకుపైగా ఓట్లను తొలగించాలంటూ టీడీపీ ఎన్నికల సెల్‌ రాష్ట్ర కో–ఆర్డినేటర్‌ కోనేరు సురేష్‌ గంపగుత్తగా ఎన్నికల సంఘానికి ఫారం–7లను అందజేశారు. వాటిపై ఆయా జిల్లాల కలెక్టర్లను ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించింది.

కొనేరు సురేష్‌ గంపగుత్తగా దరఖాస్తు చేసిన ఫారం–7లపై విచారణ చేసిన బీఎల్వోలు.. అందులో 80 శాతానికిపైగా తప్పుడు సమాచారంతో దరఖాస్తు చేశారని తేల్చారు. ఆ మేరకు జిల్లాల కలెక్టర్లు ఎన్నికల సంఘానికి నివేదికలు సమర్పించారు. ఓట్లను తొలగించేందుకు తప్పుడు సమాచారంతో ఫారం–7లు దరఖాస్తు చేయడం ఐపీసీలో సెక్షన్‌–182, ప్రజాప్రాతినిధ్య చట్టం–1950లో సెక్షన్‌–31 ప్రకారం నేరం. ఏడాది జైలు శిక్ష లేదా జరిమానా.. లేదంటే ఏడాది జైలు శిక్షతోపాటు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. అలాంటిది లక్షలాది మంది ప్రజల ఓటు హక్కును హరిస్తూ తప్పుడు సమాచారంతో గంపగుత్తగా లక్షలాది ఫారం–7లు దరఖాస్తు చేసి, అధికారుల సమయాన్ని వృథా చేసిన టీడీపీ ఎన్నికల సెల్‌ రాష్ట్ర కో–ఆర్డినేటర్‌ కొనేరు సురే‹Ùపై కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తుందన్నది ఆసక్తిగా మారింది. 
 
రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారం అమెరికాలో నిక్షిప్తం.. 

ఎన్నికల్లో ఇచ్చి న హామీల్లో 99.5 శాతం సీఎం వైఎస్‌ జగన్‌ అమలు చేశారు. దేశ చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ, నాన్‌ డీబీటీ రూపంలో రూ.4.17 లక్షల కోట్ల ప్రయోజనాన్ని ప్రజలకు చేకూర్చారు. సంక్షేమ పథకాల ఫలాలు 87 శాతం కుటుంబాలకు చేరాయి. వికేంద్రీకరణ, విప్లవాత్మక సంస్కరణలతో సుపరిపాలన అందిస్తుండటంతో సీఎం వైఎస్‌ జగన్‌కు ప్రజల్లో ఆదరణ రోజురోజుకు పెరుగుతోంది. దాంతో వచ్చే ఎన్నికల్లో 2019 ఎన్నికల కంటే ఘోర పరాజయం తప్పదని నిర్ధారణకు వచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఉనికి కాపాడుకోవడం కోసం ఎప్పటిలానే ఓటర్ల జాబితాలో అక్రమాలకు తెరతీశారు.

ఈ క్రమంలోనే అధికారంలో ఉన్నప్పుడు తస్కరించిన ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని మైపార్టీ డ్యాష్‌ బోర్డు.కామ్‌కు అనుసంధానం చేసి.. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ప్రతి బూత్‌లో ఇంటింటికీ కార్యకర్తలను పంపి.. ఓటరు పేరు, ఓటరు కార్డు నెంబరు దగ్గర నుంచి కులం, మొబైల్‌ నెంబరు, ఏ రాజకీయ పార్టీకి మద్దతు తెలుపుతారు వంటి వ్యక్తిగత వివరాలను సేకరిస్తున్నారు. ప్రజల వ్యక్తిగత వివరాలను సేకరించడం ద్వారా వారి స్వేచ్ఛను హరిస్తున్నారు. ఇది ప్రజాప్రతినిధ్య చట్టం–1950 ప్రకారం నేరం. ఇలా అక్రమంగా సేకరిస్తున్న ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని అమెరికాలో వర్జీనియాలోని యాష్‌బర్న్‌లో అమెజాన్‌ డేటా సర్వీసెస్‌లో నిక్షిప్తం చేస్తుండటం గమనార్హం. 
 
గంపగుత్తగా పది లక్షలకుపైగా ఫారం–7 దరఖాస్తులు.. 
ఎన్నికల సంఘం నిబంధనల మేరకు బూత్‌ లెవల్‌ ఏజెంట్లను నియమించుకుని.. ఓటర్ల జాబితాలో తప్పులు ఉంటే.. వాటిని తొలగించేందుకు రోజుకు గరిష్ఠంగా 5 వరకు ఫారం–7లను ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే వెసులుబాటు ఉంది. తప్పుడు సమాచారంతో ఫారం–7లను దరఖాస్తు చేస్తే.. అలా దరఖాస్తు చేసిన వారిపై బీఎల్వో(బూత్‌ లెవల్‌ ఆఫీసర్లు) చట్ట ప్రకారం కేసులు పెడతారు.

గంపగుత్తగా ఫారం–7లు అందజేయడం నిబంధనలకు విరుద్ధం. కానీ.. మైపార్టీ డ్యాష్‌ బోర్డు.కామ్‌ ద్వారా సేకరించిన సమాచారంతో తొలి దఫాలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు సుమారు పది లక్షల మంది ఓట్లను జాబితాను తొలగించాలంటూ ఫారం–7లను టీడీపీ ఎన్నికల సెల్‌ రాష్ట్ర కో–ఆర్డినేటర్‌ కోనేరు సురేష్‌ ఎన్నికల సంఘానికి అందజేయడం  గమనార్హం.  
 
బతికున్నా చనిపోయినట్లు.. నివాసం ఉన్నా వలస వెళ్లినట్లు.. 
వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు బతికున్నా సరే చనిపోయినట్లు.. నివాసం ఉన్నా సరే ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినట్లు.. చిరునామా పక్కాగా ఉన్నా నకిలీ చిరునామాతో ఓట్లు ఉన్నట్లు.. ఒకే వ్యక్తికి ఒక చోట ఓటు ఉన్పప్పటికీ రెండు చోట్ల ఓట్లు ఉన్నట్లు చిత్రీకరిస్తూ.. పది లక్షలకుపైగా ఓట్లను తొలగించాలని ఫారం–7లను గంపగుత్తగా టీడీపీ ఎన్నికల సెల్‌ రాష్ట్ర కో–ఆర్డినేటర్‌ కోనేరు సురేష్‌ ఎన్నికల సంఘానికి అందజేశారు.

వాటిపై విచారణకు ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. దాంతో.. టీడీపీ అందజేసిన ఫారం–7లను బీఎల్వోలకు పంపి క్షేత్ర స్థాయిలో విచారణ చేసింది. అందులో 80 శాతం వరకూ తప్పుడు సమాచారంతో ఫారం–7లను దరఖాస్తు చేసినట్లు బీఎల్వోలు తేల్చారు. ఆ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చారు. 
 
అన్నమయ్య జిల్లాలో బతికి ఉన్న 8,355 మందిని చంపేసిన టీడీపీ.. 
♦ అన్నమయ్య జిల్లాలో రాజంపేట, కోడురు, రాయచోటి, తంబళ్లపల్లె, పీలేరు, మదనపల్లె నియోజకవర్గాల్లో 18,936 మంది చనిపోయినట్లు, 5071 మందికి రెండు చోట్ల ఓట్లు ఉన్నట్లు, 910 నకిలీ ఓట్లు ఉన్నట్లు, 3,799 మంది శాశ్వతంగా వలస వెళ్లినట్లు, 11,642 మంది నివాసం ఉంటున్న ఇళ్లు లేనట్లు చూపి మొత్తం 40,358 మంది ఓట్లను జాబితా నుంచి తొలగించాలంటూ ఫారం–7లను టీడీపీ ఎన్నికల సెల్‌ రాష్ట్ర కో–ఆర్డినేటర్‌ కోనేరు సురేష్‌ ఎన్నికల సంఘానికి గంపగుత్తగా దరఖాస్తులు అందజేశారు. వాటిపై అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ను ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించింది. 

♦ టీడీపీ దరఖాస్తు చేసిన 40,358 ఫారం–7లపై అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ క్షేత్ర స్థాయిలో సమగ్రంగా విచారణ చేయించారు. 10,581 మంది చనిపోయినట్లు, 933 మంది శాశ్వతంగా వలసపోయినట్లు, 1397 మందికి రెండు చోట్ల ఓటు ఉన్నట్లు, 2350 ఓట్లను ఇప్పటికే తొలగించినట్లు విచారణలో వెల్లడైంది. అంటే.. టీడీపీ దరఖాస్తు చేసిన ఫారం–7లలో 25,097 నకిలీవని స్పష్టమవుతోంది. అంటే.. 8,355 మంది బతికే ఉన్నా చనిపోయినట్లు టీడీపీ చిత్రీకరించినట్లు స్పష్టమవుతోంది. తప్పుడు సమాచారం ఇచ్చి 25,097 మందికి ఓటు హక్కు లేకుండా చేసేందుకు కుట్ర పన్నింది. ఇందుకు సంబంధించిన నివేదికను ఎన్నికల సంఘానికి అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ పంపారు.  
 
విశాఖ జిల్లాలో 4,632 మంది శాశ్వతంగా వలస వెళ్లినట్లు.. 
♦ విశాఖపట్నం జిల్లాలో భీమిలి, విశాఖ ఉత్తరం, విశాఖ పశ్చిమ, పెందుర్తి, గాజువాక నియోజకవర్గాల్లో 8,914 మంది చనిపోయినట్లు, 4,862 మందికి రెండు చోట్ల ఓట్లు ఉన్నట్లు, 391 నకిలీ ఓట్లు ఉన్నట్లు, 11,279 మంది శాశ్వతంగా వలస వెళ్లినట్లు, 13,426 మంది చిరునామాలు లేనట్లు చిత్రీకరిస్తూ 38,872 ఓట్లు తొలగించాలని టీడీపీ ఎన్నికల సెల్‌ రాష్ట్ర కో–ఆర్డినేటర్‌ కోనేరు సురేష్‌ ఎన్నికల సంఘానికి ఫారం–7లను గంపగుత్తగా అందజేశారు. వాటిపై విశాఖపట్నం కలెక్టర్‌ను ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించింది. 

♦ కొనేరు సురేష్‌ దరఖాస్తు చేసిన 38,872 ఫారం–7లపై విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ క్షేత్ర స్థాయిలో సమగ్రంగా విచారణ చేయించారు. ఇందులో 26,123 ఫారం–7లు తప్పుడు సమాచారంతో దరఖాస్తు తేల్చారని తేల్చారు. టీడీపీ దరఖాస్తు చేసిన ఫారం–7ల మేరకు 5,027 మంది చనిపోయినట్లు, 6,647 మంది శాశ్వతంగా వలస వెళ్లినట్లు, 841 మందికి రెండు ఓట్ల ఓట్లు ఉన్నట్లు తేల్చారు. ఇప్పటికే 254 ఓట్లు తొలంచినట్లు తేల్చారు. వీటిని పరిశీలిస్తే.. విశాఖ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 3,887 మంది బతికే ఉన్నా చనిపోయినట్లు, 4,632 మంది స్థానికంగా నివాసం ఉన్నా శాశ్వతంగా వలస పోయినట్లు టీడీపీ తప్పుడు సమాచారం ఇచ్చి నట్లు స్పష్టమవుతోంది. ఆ మేరకు విచారణ నివేదికను విశాఖ కలెక్టర్‌ ఎన్నికల సంఘానికి నివేదించారు.  
 
గుంతకల్లు నియోజకవర్గంలో 4,666 ఓట్ల తొలగింపునకు కుట్ర 
♦ అనంతపురం జిల్లాలో గుంతకల్లు నియోజవకర్గంలో 9,582, రాయదుర్గం నియోజకవర్గంలో 6,130, శింగనమల నియోజకవర్గంలో 1904, అనంతపురం నియోజకవర్గంలో 1803, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 6,416 ఓట్లను తొలగించాలంటూ ఫారం–7లను టీడీపీ ఎన్నికల సెల్‌ రాష్ట్ర కో–ఆర్డినేటర్‌ కోనేరు సురేష్‌ గంపగుత్తగా ఎన్నికల సంఘానికి అందజేశారు. వాటిపై అనంతపురం జిల్లా కలెక్టర్‌ను ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించింది.  

♦ టీడీపీ దరఖాస్తు చేసిన ఫారం–7లపై అనంతపురం జిల్లా కలెక్టర్‌ క్షేత్రస్థాయిలో విచారణ చేయించారు. గుంతకల్లు నియోజవకర్గంలో 4,666, రాయదుర్గంలో 1,630, శింగనమలలో 1137, అనంతపురంలో 406, కళ్యాణదుర్గంలో 2,640 ఓట్లు అర్హమైనవిగా తేల్చారు. అంటే.. టీడీపీ ఎంత భారీ ఎత్తున తప్పుడు ఫారం–7లను దరఖాస్తు చేసిందో విశదం చేసుకోవచ్చు. 
  
కుప్పంలో 2,435 మందిని చంపేశారు.. 
♦ టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో కుప్పం, నగరి, జీడినెల్లూరు, పుంగనూరు నియోజకవర్గాల్లో 27,008 ఓట్ల తొలగింపు కోసం ఫారం–7లను ఆపార్టీ ఎన్నికల సెల్‌ రాష్ట్ర కో–ఆర్డినేటర్‌ కోనేరు సురేష్‌ దరఖాస్తు చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వాటిపై చిత్తూరు జిల్లా కలెక్టర్‌ సమగ్రంగా విచారణ చేయించారు. ఎన్టీఆర్‌ దెబ్బకు 1983 ఎన్నికల్లో సొంతూరు ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో ఘోరంగా ఓడిపోయి 1989 ఎన్నికలకు కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు వలస వెళ్లారు.

అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే ఆరు సార్లు వరుసగా గెలిపించిన పాపానికి కుప్పం నియోజకవర్గంలో 2,435 మంది బతికి ఉన్నప్పటికీ చనిపోయినట్లుగా తేల్చేసిన టీడీపీ వారి ఓట్లు తొలగించాలని ఫారం–7లు దరఖాస్తు చేసినట్లు కలెక్టర్‌ విచారణలో వెల్లడైంది. ఇక చిత్తూరు జిల్లాలో పుంగనూరు, నగరి, జీడీ నెల్లూరు, కుప్పం నియోజకవర్గాల్లో బతికి ఉన్న 4,780 మందిని కొనేరు సురేష్‌ చనిపోయినట్లుగా చిత్రీకరించి.. వారి ఓట్లను తొలగించాలని కోరడం గమనార్హం.  
 
కలెక్టర్లను బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్న టీడీపీ 
రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల తొలగింపునకు టీడీపీ దరఖాస్తు చేసిన ఫారం–7లపై విచారణ చేసిన కలెక్టర్లు.. అందులో 80 శాతానికిపైగా తప్పుడు సమాచారంతో కూడుకున్నవని తేల్చారు. అర్హుల ఓట్లను జాబితా నుంచి తొలగించేది లేదని స్పష్టం చేశారు. దాంతో ఆ ఓట్లను తొలగించాలంటూ కలెక్టర్లను టీడీపీ నేతలు బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారు. విజయనగరం, విశాఖపట్నం, అన్నమయ్య, అనంతపురం, కర్నూల్, చిత్తూరు, శ్రీకాకుళం, తిరుపతి జిల్లాల కలెక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఇటీవల ఎన్నికల సంఘానికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడమే అందుకు తార్కాణం. 

2019 ఎన్నికలకు ముందు 50.23 లక్షల ఓట్లు తొలగింపు 
విభజన నేపథ్యంలో 2014లో అధికారంలోకి వచ్చి న టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆధార్‌తోసహా ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఈ–ప్రగతి నుంచి ప్రైవేటు సంస్థలు ఐటీ గ్రిడ్స్, బ్లూప్రాగ్‌ సంస్థలకు చేరవేశారు. అదే సంస్థలతో టీడీపీ సేవా మిత్ర యాప్‌ను తయారుచేయించి.. తస్కరించిన ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దానితో అనుసంధానం చేశారు. దీనిపై హైదరాబాద్‌లోని మాదాపూర్‌ పోలీసు స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. 2015–17 మధ్య ఇంటింటికీ వెళ్లిన టీడీపీ కార్యకర్తలు సేవా మిత్ర యాప్‌లలో ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి, వైఎస్సార్‌సీపీకి మద్దతు తెలుపుతామని చెప్పిన వారి ఓట్లను తొలగించేలా ఫారం–7లను దరఖాస్తు చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆ ఓట్లను తొలగించేలా చంద్రబాబు చక్రం తిప్పారు.

రాష్ట్రంలో 2015లో 22,76,714, 2016లో 13,00,613, 2017లో 14,46,238 వెరసి 50,23,565 ఓట్లను చంద్రబాబు తొలగింపజేశారు. చంద్రబాబుకు మాత్రమే సాధ్యమైన ఈ కుట్రను ప్రజాసంఘాలు బహిర్గతం చేశాయి. దీనిపై వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు మేరకు కేంద్ర ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించింది. అర్హుల ఓట్లను కూడా తొలగించినట్లు తేల్చిన ఎన్నికల అధికారులు 2019 ఎన్నికల నాటికి 31,97,473 ఓట్లను జాబితాలో చేర్చారు. దీంతో గత ఎన్నికల్లో 50 శాతానికిపైగా ఓట్లు సాధించి 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అఖండ విజయం సాధించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement