
ఎన్నికల బరిలో శశికళ !
అన్నాడీఎంకేలో చర్చలు
చెన్నై, సాక్షి ప్రతినిధి: అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ ఎన్నికల బరిలో దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. తంజావూరు జిల్లా నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధమైనట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. అన్నిపార్టీల్లో ఎన్నికల వేడి రాజుకుంది. ఈ తరుణంలో అన్నాడీఎంకే సైతం అభ్యర్థుల ఖరారులో పడిపోయింది. అన్నాడీఎంకే నుంచి పోటీకి సుమారు 17,698 మంది దరఖాస్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రి జయలలిత తమ నియోజకవర్గం నుంచి పోటీచేయాలని కోరుతూ 7,936 మంది దరఖాస్తు చేశారు.
ఈ దరఖాస్తులను పరిశీలించి అభ్యర్థులను ఖరారుకు కసరత్తు జరుగుతోంది. ఈ దశలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జయకు అత్యంత ప్రీతిపాత్రురాలైన శశికళ తొలిసారిగా రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని అన్నాడీఎంకేలోని సీనియర్ మంత్రులే గుసగుసలాడుతున్నారు. కష్టనష్టాల్లో జయలలితకు తోడై నిలుస్తున్న శశికళ ప్రభుత్వంలో కూడా అండగా నిలవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితతోపాటూ శశికళకు జైలు శిక్ష పడింది. బెయిల్ దక్కింది.
పార్టీపై పెత్తనం చేస్తున్నదనే ఆరోపణలతో శశికళను ఇంటి నుంచి పంపివేసిన జయలలిత ఆ తరువాత మళ్లీ చేరదీశారు. కొంతకాలంగా పాత తరహా ఆప్తులుగా వ్యవహరిస్తున్నారు. ప్రైవేటు కార్యక్రమాలకు జయతోపాటూ శశికళ కూడా హాజరవుతున్నారు. తెరవెనుక అంతరంగీకురాలిగా ఉన్న శశికళ తెరపైకి రావడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. శశికళ పోటీ చేయడంపై జయ వైఖరి ఏమిటో వెల్లడి కావడం లేదు.
తంజావూరు జిల్లా నుంచి పోటీ చేయాలని దాదాపు ఖరారు కాగా, ఏ నియోజకవర్గం తమకు అనుకూలమని శశికళ తన బంధువులతో సర్వే చేయిస్తున్నట్లు సమాచారం. శశికళ అకస్మాత్తుగా రాజకీయ ప్రవేశం చేయనుండడంపై పార్టీలో రసవత్తర చర్చ సాగుతోంది. ప్రస్తుతం పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఆర్థికమంత్రి ఓ పన్నీర్ సెల్వం రెండో నాయకుడిగా కొనసాగుతున్నారు. జయ జైలుకు వెళ్లినపుడల్లా సీఎం పీఠాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు.
పార్టీ నేతలు జయను కలుసుకోవడం వీలుకాకుంటే పన్నీర్ సెల్వం వద్దనే అన్నీ మొరపెట్టుకుంటారు. జయలలిత తరువాతి స్థానం పన్నీర్‌సెల్వానికి దక్కడం సహించలేని శశివర్గం ఒత్తిడితోనే పోటీకి దిగుతున్నట్లు ఒక ప్రచారం ఉంది. పన్నీర్ సెల్వం పెత్తనానికి స్వస్తి పలకాలంటే శశికళను ఎమ్మెల్యేగా, ఆ తరువాత మంత్రిగా చేసి నెంబరు టూ స్థానంలో నిలబెట్టాలని వ్యూహం పన్నుతున్నారు. ఈ ఎన్నికలను చేజార్చుకుంటే మరో ఐదేళ్లపాటూ నిరీక్షించాల్సి ఉంటుందని, ఈ జాప్యం క్షేమం కాదని భావిస్తున్నారు. ఎన్నికల్లో తప్పనిసరిగా పోటీచేయాలన్న శశికళ నిర్ణయం పార్టీలో కలకలం రేపుతోంది.